Chiranjeevi | తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం టాలీవుడ్‌కు గర్వకారణంగా మారింది. దశాబ్దాల పాటు తెలుగు సినిమా అభివృద్ధికి వారు అందించిన సేవలకు దేశ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు సినీ పరిశ్రమకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ సంతోషకర సందర్భాన్ని మరింత గుర్తుండిపోయేలా చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అవార్డు ప్రకటన వెలువడిన వెంటనే ఆయన స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల నివాసాలకు వెళ్లి వారిని కలిశారు. శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
తెలుగు సినిమాకు దక్కిన ఈ జాతీయ గౌరవం ఒక చారిత్రక ఘట్టమని పేర్కొంటూ, ఇది భవిష్యత్ తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ముగ్గురి మధ్య సాగిన ఆత్మీయ సంభాషణలు, పాత జ్ఞాపకాలు పంచుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. దశాబ్దాలుగా కలిసి పనిచేసిన అనుబంధం, పరస్పర గౌరవం ఈ భేటీలో స్పష్టంగా కనిపించిందని అక్కడున్నవారు తెలిపారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా చిరంజీవి పద్మ అవార్డు గ్రహీతలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. విశిష్ట వ్యక్తులను సత్కరించే అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంటూ, పద్మ విభూషణ్‌కు ఎంపికైన ధర్మజీ, పద్మ భూషణ్ అందుకున్న మమ్ముట్టీ, డాక్టర్ దత్తాత్రేయుడు నోరి వంటి మహనీయులు దశాబ్దాల పాటు చూపిన అంకితభావానికి ఇది తగిన గౌరవమని ప్రశంసించారు.
అలాగే మిత్రులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, సోదరుడు మాధవన్, భారత క్రికెట్ జట్టు చాంపియన్ రోహిత్ శర్మ, వరల్డ్‌కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ లభించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. కళలు, విజ్ఞానం, వైద్యం, సాహిత్యం, క్రీడలు వంటి విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించిన 2026 సంవత్సరపు పద్మ అవార్డు గ్రహీతలందరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి సేవలు దేశానికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని చిరంజీవి పేర్కొన్నారు. కాగా, చిరంజీవి నటించిన రీసెంట్ చిత్రం మన శంకర వరప్రసాద్‌గారు చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.