వినసొంపైన గీతాలు ఆలపించిన చిన్మయి శ్రీపాద.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటుంది. హిందుస్థానీ రాగాలు, కర్ణాటక సంగీత బాణీలపై పూర్తిస్థాయి పట్టున్న ఆమె ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. నేపథ్య గాయకు రాలిగా మాత్రమే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ తన సత్తా చాటుతున్న చిన్మయితో చిట్‌చాట్..
మా కుటుంబంలో అందరూ శాస్త్రీయ సంగీత విద్వాంసులే. నేను సంగీతంలో పుట్టిపెరిగాను అని చెప్పొచ్చు. మా అమ్మ నా తొలిగురువు. రెండున్నరేండ్ల వయసు నుంచే అమ్మ నాకు సంగీత పాఠాలు చెప్పేది. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ రెండూ అభ్యసించాను. ఒడిస్సీ నృత్యం కూడా నేర్చుకున్నా. నేను తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలను. ‘బ్లూ ఎలిఫెంట్’ పేరుతో భాషాసేవ సంస్థ ప్రారంభించాను. హిల్లరీ క్లింటన్ చెన్నై పర్యటన సందర్భంగా మా సంస్థకు చెందిన వ్యక్తులు అధికారిక దుబాసీలుగా వ్యవహరించారు.
ఒకరోజు రేవతి కథానాయికగా నటించిన ‘పుదియ ముగం’ సినిమాలోని పాట విన్నా! వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లి ‘నేను ప్లేబ్యాక్ సింగర్ అవుతాను’ అని చెప్పేశా! ‘సినిమా ఇండస్ట్రీ ఒక సముద్రం. అక్కడ మనకు పరిచయం ఉన్నవాళ్లు ఎవరూ లేరు. పిచ్చిపిచ్చి ఆలోచనలు మానుకొని శాస్త్రీయ సంగీతంపై దృష్టిపెట్టు’ అని మందలించింది. ఆ మాటలు విన్నాక జీవితంలో సినిమా పాటలు పాడలేనేమో అనిపించింది. కానీ, 2002లో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ‘కన్నత్తిల్ ముత్తమిట్టల్’ సినిమాలో అనుకోకుండా టైటిల్ సాంగ్ పాడే చాన్స్ నాకు వచ్చింది. అప్పట్నుంచి 21 ఏండ్లుగా నా ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. 2006లో మొదటిసారి ‘సిల్లును ఒరు కాదల్’ సినిమాలో కథానాయిక భూమికకు డబ్బింగ్ చెప్పాను. ఇప్పటివరకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 85 చిత్రాలకు డబ్బింగ్ చెప్పాను.