మరాఠీ యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘ఛావా’ చిత్రానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్నది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మాత. ఈ సినిమా వసూళ్లు 700కోట్లకు చేరువవుతున్నాయి. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు వెర్షన్ రిలీజ్ సందర్భంగా హీరో విక్కీకౌశల్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన మొదటివారం నుంచి తెలుగులో డబ్ చేయాలనే డిమాండ్స్ వచ్చాయని, గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని, శంభాజీ మహారాజ్ అసమాన త్యాగాన్ని ఆవిష్కరిస్తూ ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలిస్తుందని విక్కీ కౌశల్ వీడియోలో తెలిపారు. తెలుగు రాష్ర్టాల్లో 550 స్క్రీన్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వెల్లడించింది.