అక్షర యోధుడు అనంతలోకాలకు చేరాడు. ఉషాకిరణాలను వెండితెరపై ప్రసరింపజేసిన కళాభానుడు అస్తమించాడు.. వేలాదిమందిలో స్ఫూర్తిని నింపిన సృజనమూర్తి పవిత్రాత్మగా మారాడు.. రొడ్డకొట్టుడు విధానాలను సంస్కరించి, అడుగుపెట్టిన అన్నిరంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికి.. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధినిచ్చిన దార్శనికుడు.. పత్రికాధిపతి.. వ్యాపారదిగ్గజం, సినీ నిర్మాత, రామోజీ ఫిల్మ్‌సిటీ అధినేత, పంపిణీదారుడు, పద్మవిభూషణుడు.. చెరుకూరి రామోజీరావు మహాభినిష్క్రమణం చెందారు.
Ramoji Rao | సినిమాలంటే రామోజీరావుకి ప్రత్యేకమైన అభిమానం. ఆ ఇష్టంతోనే ఉషాకిరణ్మూవీస్ని స్థాపించారాయన. తొలి ప్రయత్నంగా ‘శ్రీవారికి ప్రేమలేఖ’(1984) తీశారు. నరేశ్, పూర్ణిమ జంటగా జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. తెలుగునాట నవ్వుల వర్షం, రామోజీరావుకు కాసుల వర్షం కురిపించింది. అదే ఏడాది ఆయన ప్రొడక్షన్ నుంచి వచ్చిన మరో అద్భుతం ‘మయూరి’. నృత్యకళాకారిణి సుధాచంద్రన్ జీవితానికి తెరరూపాన్నిస్తూ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అందుకోని గౌరవం లేదు. ఇక అక్కడ్నుంచి నిర్మాతగా వెనుదిరిగి చూసుకోలేదు రామోజీరావు. అలాగే విలువలను కూడా వదులుకోలేదు. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే.. అది కచ్చితంగా గొప్ప సినిమానే అయ్యుంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగేలా అద్భుతమైన సినిమాలను నిర్మించారు రామోజీరావు. ఆ కోవకు చెందిన సినిమానే టి.కృష్ణ ‘ప్రతిఘటన’(1985). రౌడీ రాజకీయాలపై ఓ ఉపాధ్యాయురాలు చేసిన పోరాటమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన ఆ సినిమా ఆ రోజుల్లో పెను సంచలనం. దర్శకుడిగా టి.కృష్ణనీ, హీరోయిన్గా విజయశాంతిని అగ్రపథాన నిలబెట్టిందీ సినిమా. ఆ ఏడాది అవార్డులపరంగా, రివార్డుల పరంగా తిరుగులేని సినిమాగా నిలిచింది. అంతేకాక, తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదలై విజయాలను అందుకున్నది.
సినిమాపై ఇష్టంతో తన సొంత పత్రిక ఈనాడులో ప్రత్యేకంగా సినిమాకు ఓ పేజీని కేటాయించారు రామోజీరావు. ఈ పద్దతిని తర్వాత అన్ని పత్రికలూ అవలంబించాయి. ‘సితార’ పేరుతో రామోజీరావు సినీ పత్రిక వార పత్రికను నడిపారు.
పంపిణీదారుడిగా, ఎగ్జిబిటర్‌గా కూడా తనదైన ముద్ర వేశారు రామోజీ. ఇక రామోజీ ఫిల్మ్‌సిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కవే. ఇది దేశానికే కాదు, ఆసియా ఖండానికే గర్వకారణం. ఇలా సినీరంగానికి రామోజీరావు చేసిన సేవ సామాన్యమైనది కాదు. రామోజీరావు మరణం సినీరంగానికి నిజంగా తీరని లోటు.

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతికి సంతాప సూచకంగా ఆదివారం సినిమా షూటింగ్స్ బంద్ చేయబోతున్నట్లు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు శనివారం ఫిల్మ్‌సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి మోహన్‌బాబు, రాఘవేంద్రరావు, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, నరేష్, కల్యాణ్‌రామ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

రామోజీగ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న అగ్ర హీరోలు చిరంజీవి, పవన్‌కల్యాణ్, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి.


రామోజీరావుగారు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. వినోదభరితమైన కార్యక్రమాలకు మార్గదర్శిలా నిలిచారు. ఆయన నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా మరియు స్టూడియో యజమానిగా పరిశ్రమకు విశేషమైన సేవలందించారు. ఎందరో నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులను పరిశ్రమకు పరిచయం చేశారు. తెలుగువారందరూ ఆయన సేవలను చిరస్థాయిగా గుర్తుంచుకుంటారు.
-తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి
భారతీయ చలన చిత్ర పరిశ్రమ, మీడియా, వినోదరంగాలకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాం.
-తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్