Actor Suresh Gopi | ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపి చిక్కుల్లో పడ్డారు. మీడియా ఇంటరాక్షన్లో ఓ మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు నటుడు, రాజకీయ నేత అయిన సురేశ్ గోపీపై నడకావు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె కోజికోడ్ నగర ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం కేసును నడకావు పోలీసులకు అప్పగించారు. నటుడి ప్రవర్తనతో తాను మానసికంగా కలత చెందానని జర్నలిస్ట్ పేర్కొన్నారు. జర్నలిస్ట్ ఫిర్యాదు మేరకు నటుడిపై సెక్షన్ 354ఏ కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (KUWJ) కోరింది. అలాగే సమయంలో కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ సైతం స్పందించి జిల్లా పోలీస్ చీఫ్ నుంచి నివేదికను కోరింది.
సురేశ్ గోపీ నార్త్ కోజిక్కోడ్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమయంలోనే ఓ మహిళా విలేకరికి సమాధానం ఇస్తూనే ఆమె భుజాలపై చేయి వేశారు. సురేశ్ గోపీ ప్రవర్తనతో ఖంగుతిన్న సదరు మహిళా జర్నలిస్ట్ కాస్త దూరం జరిగింది. ఆ తర్వాత మరో ప్రశ్న అడిగేందుకు ముందుకు వచ్చిన సందర్భంలో మరోసారి ఆమెను తాకారు. ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సురేశ్ గోపీ ప్రవర్తనపై నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మహిళా జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టిన ఆయన.. క్షమాపణలు కోరారు. తాను ఆమెను కుమార్తెగా భావించానని.. ఆప్యాయంగానే భుజంపై చేసి వేశానన్నారు. జర్నలిస్ట్ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని.. తన ప్రవర్తతో ఇబ్బంది పడినట్లయితే చెబుతున్నట్లు పోస్ట్ పెట్టారు.