‘ఆనాడు సినిమా మాధ్యమం ద్వారా నాన్న ఎన్టీఆర్ భక్తిని కాపాడారు. ఈనాడు అదే భక్తి మా సినిమాను బతికించిందని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇది కేవలం మా యూనిట్ విజయం కాదు.యావత్ చలన చిత్ర పరిశ్రమ సక్సెస్‌గా భావిస్తున్నా’ అని అన్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘మంచి సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం చేయాలనే సంకల్పంతో 21 నెలలు ఎన్నో కష్టాలు పడి షూటింగ్ చేశాం. మా శ్రమకు తగిన ప్రతిఫలం దక్కింది. ‘అఖండ’కు అఖండమైన విజయాన్ని తెలుగు ప్రేక్షకులు అందించారు’ అని అన్నారు. ‘థియేటర్లకు గత వైభవాన్ని తీసుకొచ్చిన సినిమా ఇది. సినిమా చూసిన వారందరి నోట సూపర్‌హిట్ అనే మాట వినిపిస్తున్నది’ అని బోయపాటి శ్రీను తెలిపారు. తెలుగు ప్రేక్షకులందరూ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారని నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమన్ పాల్గొన్నారు.