Thandel Movie Leaked Online | టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు చేసిన ఒక పని వలన తండేల్ సినిమా కలెక్షన్స్‌కి దెబ్బపడింది. అవును ఈ విషయాన్ని బన్నీ వాసు తాజాగా వెల్లడించారు. అసలు విషయానికి వస్తే.. నటుడు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం తండేల్ (Thandel). ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించాడు. ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా పైరసీ విషయంలో పెట్టిన ప్రెస్ మీట్ వలన మూవీ కలెక్షన్లపై బాగా ఎఫెక్ట్ పడిందని చెప్పుకోచ్చాడు బన్నీ వాసు.
ఈ సినిమా వచ్చి రెండు రోజులు కూడా కాకముందే ఆన్లైన్లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. పలు పైరసీ వెబ్ సైట్లలో ఈ సినిమా హెచ్డీ వెర్షన్లో అందుబాటులోకి వచ్చింది. దీంతో చిత్రబృందం వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ‘తండేల్’ సినిమాను పైరసీ చేస్తున్న వెబ్‌సైట్స్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే మా హెచ్చరిక. అందరిపై కేసులు పెడుతున్నాం. మీరు జైలుకి వెళ్లే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. అయితే ఇలా ప్రెస్ మీట్ పెట్టడం వలనే ఎక్కువ నష్టపోయాం అంటూ చెప్పుకోచ్చాడు బన్నీ వాసు.
బన్నీ వాసు మాట్లాడుతూ.. ”’తండేల్’ HD వెర్షన్లో అందుబాటులోకి వచ్చిందని తెలియడంతో సైబర్ నేరగాళ్లకు వార్నింగ్ ఇవ్వాలని ప్రెస్ మీట్ పెట్టాం. కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టడం వలన మాకే నష్టం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టకముందు వరకు తండేల్ HD ప్రింట్ లీక్ అయ్యిందని ఎవరికి తెలియదు. మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే ఇంకా ఎక్కువగా ప్రచారం జరిగి తండేల్ని పైరసీ వెర్షన్‌ను ఎక్కువమంది చూశారు. ప్రెస్ మీట్ పెట్టినందుకు ఇప్పటికి బాధపడుతున్నాము అంటూ” బన్నీ వాసు చెప్పుకోచ్చాడు.