Cinema News | బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ సినిమాలోని బ్రహ్మానందం ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. సంప్రదాయ పంచెకట్టులో, హూందాగా నవ్వుతూ నడుస్తూవస్తున్న బ్రహ్మానందాన్ని ఈ లుక్‌లో చూడొచ్చు.
ఈ నెల 19న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ని కూడా విడుదల చేయనున్నామని మేకర్స్ తెలిపారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన మళ్లీరావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, మసూద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయని మేకర్స్ తెలిపారు.
ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హూలక్కల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిసపాటి.