‘దర్శకుడు దయా చెప్పిన కథ, అందులోని నా పాత్ర వాస్తవానికి దగ్గరగా, భిన్నంగా ఉండటంతో చేయడానికి ఒప్పుకున్నాను. బడ్జెట్ లేకపోవడంతో రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. సినిమా హిట్ అయితే లాభాల్లో కొంత ఇస్తే తీసుకుంటా.’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. ఆయన లీడ్ రోల్ చేసిన డార్క్ కామెడీ డ్రామా ‘బాపు’. ఆమని, బలగం సుధాకర్‌రెడ్డి, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రధారులు. దయా దర్శకత్వంలో రాజు, సీహెచ్ భానుప్రసాద్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు బ్రహ్మాజీ. ‘ఇది చాలా యునిక్ కాన్సెప్ట్. రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. అందుకే ఇందులోని నా పాత్ర సూసైడ్‌కి ట్రై చేస్తుంది. తర్వాత ఏమైంది? అనేది ఈ సినిమా కథ. ఇందులోనేను పత్తి రైతుగా నటించా. ఇందులో ‘బాపు’గా బలగం సుధాకర్‌రెడ్డి టైటిల్‌రోల్ పోషించారు. ఆయన పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. ఆలోచింపజేయడంతోపాటు వినోదాన్ని కూడా పంచే సినిమా ఇది.’ అని బ్రహ్మాజీ చెప్పారు.