బాలీవుడ్ (Bollywood) నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) జీవిత విశేషాలతో ఓ పుస్తకం వెలువడనుంది. ఈ పుస్తకాన్ని రచయిత ఎస్ఎంఎం ఔసజ (SMM Ausaja) రచిస్తున్నారు. 3.5 కిలోల బరువున్న ఈ పుస్తకంలో మూడు తరాల అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు (Amitabh Bachchan Family) సాధించిన విజయాలు, వృత్తిపర, వ్యక్తిగత వివరాలను చేర్చనున్నారు. బచ్చన్స్ (Bachchans) పేరుతో ఈ పుస్తకం ప్రింటింగ్ కు సిద్ధమవుతున్నది. అమితాబ్, అతని కుటుంబ సభ్యుల గురించి తెలియని విషయాలు, చూడని ఫొటోలతో సమగ్రంగా పుస్తకాన్నితయారు చేస్తున్నట్లు రచయిత ఔసజ తెలిపారు.
అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ ప్రముఖ రచయిత. ఆయన రాసిన రచనలు దేశంలోనే కాక విదేశాల్లోనూ నాటకాలుగా ప్రదర్శితం అవుతుంటాయి. నటుడిగా అమితాబ్ సృష్టించిన చరిత్ర తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ నటీనటులుగా చిత్రరంగంలో సాధించిన విజయాలూ ప్రత్యేకమైనవే. ఈ విశేషాలన్నీ బచ్చన్స్ పుస్తకంలో చోటు చేసుకుంటాయని ఔసజ చెబుతున్నారు.
రచయిత ఔసజ మాట్లాడుతూ…అమితాబ్ బచ్చన్ నట, జీవిత విశేషాల గురించి పుస్తకాలు వచ్చాయి. అయితే కొన్నేళ్లుగా సేకరిస్తున్న సమాచారం, అరుదైన ఫొటోలతో బచ్చన్స్ పేరుతో నేను పుస్తకాన్ని ప్రచురించబోతున్నా. ఇది మిగతా వాటితో చూస్తే ప్రత్యేకమైనదని చెప్పగలను. మూడు తరాలుగా బచ్చన్ కుటుంబ సభ్యులు సాధించిన విజయాలు పుస్తకంలో పొందుపరుస్తున్నా. ఈ పుస్తకాన్ని అమితాబ్ బచ్చన్ పుట్టినరోజైన అక్టోబర్ 11న విడుదల చేయాలనుకుంటున్నా.. అని తెలిపారు.