Trisha | తమిళనాడులో ప్రముఖులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ నివాసంతో పాటు పలు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో భద్రతా వ్యవస్థ పూర్తిగా హైఅలర్ట్ మోడ్‌లోకి వెళ్లింది. గురువారం (అక్టోబర్ 2) సాయంత్రం నుంచి ఈ బెదిరింపు కాల్స్ వరుసగా రావడం ప్రారంభమయ్యాయి. సీఎం స్టాలిన్ నివాసం, చెన్నై రాజ్‌భవన్, బీజేపీ పార్టీ కార్యాలయం, మరియు సినీ నటి త్రిషా ఇంటికి ఫోన్ కాల్స్ ద్వారా బాంబులు పెట్టామంటూ బెదిరింపులు రావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది..
బాంబు బెదిరింపుల నేపథ్యంలో చెన్నై పోలీసు శాఖ తక్షణమే స్పందించింది. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), డాగ్ స్క్వాడ్‌తో పాటు పలు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభ్యంకాలేదని పోలీసులు వెల్లడించారు. స్టార్ హీరోయిన్ త్రిషా చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తున్నారు. ఇది సీఎం స్టాలిన్ నివసించే చిత్తరంజన్ రోడ్ కు సమీప ప్రాంతం కావడంతో భద్రతా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కాల్స్ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై సైబర్ క్రైమ్ విభాగం విచారణ ప్రారంభించింది. కాల్స్ చేసిన వ్యక్తుల కాల్ లొకేషన్, టెక్నికల్ ఆధారాలు సేకరించి విచారణ జరుగుతోంది. ఇది కేవలం ఆకతాయిల ప్రయత్నమా? లేక రాజకీయ లేదా వ్యక్తిగత కుట్రల భాగమా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడా, జూలై 27న సీఎం స్టాలిన్ ఇంటికి వచ్చిన బెదిరింపు కాల్‌ను ఆకతాయిల పనిగా పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తిరిగి పలువురు ప్రముఖుల్ని టార్గెట్ చేయడం, క్రమం తప్పకుండా బెదిరింపులు రావడం పోలీసు శాఖను మరింత అప్రమత్తం చేస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకుంది. నిందితులను త్వరగా పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అలాగే, ముఖ్యమైన వ్యక్తుల నివాస ప్రాంతాల్లో భద్రతా చర్యలను బలోపేతం చేసింది.