ఓ ఇంటర్వ్యూలో చిత్రంగా మాట్లాడి నెటిజన్లకు టార్గెట్‌గా మారింది బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా. తన తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ఉత్తరాఖండ్‌లో నా పేరిట ఓ ఆలయం ఉంది తెలుసా? ఎవరైనా బద్రీనాథ్ వెళితే.. పక్కనే ఉన్న నా ఆలయాన్ని కూడా సందర్శించండి’ అని చెప్పింది. ఇంకా మాట్లాడుతూ ‘దిల్లీ విశ్వవిద్యాలయంలోనూ నా ఫొటోకు పూలమాల వేసి నన్ను ‘దండమమాయి’ అని పిలుస్తుంటారు తెలుసా? ఈ విషయంపై పలు వార్తా పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి.
కావాలంటే నెట్లో చూడండి’ అంటూ చెప్పుకొచ్చింది ఊర్వశీ. అంతటితో ఆగకుండా.. ‘దక్షిణాదిలో చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ వంటి టాప్‌స్టార్స్‌తో నటించా. అక్కడ కూడా నాకెంతోమంది అభిమానులున్నారు. దక్షిణాదిలోనూ నాకు రెండో ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నా’ అని చెప్పింది ఊర్వశి.
ఈ పైత్యమంతా వింటున్న సదరు యాంకర్.. ‘మీ గుడికి వచ్చిన వారికి మీ ఆశీర్వాదం ఉంటుందా? అని అడగ్గా.. ‘అన్ని ఆలయాల్లో ఏం జరుగుతాయో.. అక్కడా అవే జరుగుతాయ్..’ అని సమాధానమిచ్చింది ఊర్వశీ రౌతేలా. ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లంతా ‘పాపం.. ఈమె పూర్తిగా భ్రమలో ఉండిపోయింది..’ అంటూ కామెంట్లతో ఆట పట్టిస్తున్నారు.