‘మహిళలకు ఎక్స్పైరీ డేట్ ఏంటీ?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది బాలీవుడ్ సీనియర్ నటి మోనా సింగ్. బాలీవుడ్‌తోపాటు దాదాపు అన్ని భాషల చిత్రసీమల్లోనూ నటీనటుల వయసుకు సంబంధించి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ మండిపడింది. మగవాళ్లు 60 ఏళ్లలోనూ రొమాంటిక్ క్యారెక్టర్లు చేస్తున్నారనీ, అదే హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి చాలాతేడా చూపుతున్నారని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోనాసింగ్ మాట్లాడింది. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నా నిజమైన వయసు కన్నా 10-15 ఏళ్ల వయసు ఎక్కువగా ఉండే క్యారెక్టర్లు చేయాల్సి వస్తున్నది. అయినా, నా ఆన్‌స్క్రీన్ వయసు గురించి నేనంతగా పట్టించుకోను. ఎందుకంటే.. ఆ క్యారెక్టర్ చేయగలనని నాకు తెలుసు. నా గురించి, నా సత్తా గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇక్కడ నేను కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీ లేదు. అందుకే.. నేను రిస్క్ తీసుకుంటూనే ఉంటా!” అంటూ చెప్పుకొచ్చింది.
స్క్రీన్‌పై అంతపెద్ద వయసు క్యారెక్టర్లు ఎందుకు చేస్తున్నావంటూ తన అభిమానులు ఎప్పుడూ అడుగుతుంటారనీ, దానికి సమాధానంగా.. ‘అది నా క్యారెక్టర్’ అని చెప్తానని అంటున్నది. ఓటీటీ వెబ్ సిరీస్ ‘కొహ్రా- సీజన్2’లో భాగం కావడం ఒక సంపూర్ణ గౌరవంగా భావిస్తానని మోనా సింగ్ పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న రెండో సీజన్లో మోనా సింగ్ ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు లీడర్ ధన్వంత్ కౌర్ పాత్ర పోషించింది.