తన తల్లి హేమమాలిని ఇచ్చిన ధైర్యంతోనే.. జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, తట్టుకొని నిలబడ గలుగుతున్నానని అంటున్నది బాలీవుడ్ తార ఈశా డియోల్. బాలీవుడ్ డ్రీమ్గర్ల్గా దేశవ్యాప్తంగా సెలెబ్రిటీ అయినా.. తనను మాత్రం ఓ సాధారణ తల్లిలాగే పెంచిందనీ చెప్పుకొచ్చింది. తన కొత్తచిత్రం ‘తుమ్కో మేరీ కసమ్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా.. ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది ఈశా. ఈ సందర్భంగా మహిళల జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నది.
“మనదేశంలో ప్రతితల్లీ తన కూతురికి ఏదో ఒక సందర్భంలో సలహాలు, సూచనలు ఇస్తుంది. అందులో ముఖ్యమైంది, తప్పకుండా చెప్పేది.. వివాహం తర్వాత కూడా అమ్మాయిలు సొంత గుర్తింపును కలిగి ఉండాలని. మా అమ్మకూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆమెకూడా నాకు ఎప్పుడూ ఇదే విషయం చెప్పేది. బతకడానికి ఎవరిపైనో ఆధారపడాల్సిన అవసరంలేదనీ, ఎప్పుడూ స్వతంత్రంగా జీవించాలని చెబుతూ ఉంటుంది” అంటూ తన తల్లి ఇచ్చిన సలహాలు, సూచనలను చెప్పుకొచ్చింది. ‘ఆడవాళ్లమైనా కష్టపడి పనిచేస్తున్నాం.
మనకంటూ ఒక వృత్తి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని ఎప్పుడూ విస్మరించొద్దు. జీవితంలో గొప్పపేరు సంపాదించుకోక పోయినా.. పనిచేయడం మాత్రం ఆపవద్దు’ అంటూ హేమమాలిని హితబోధ చేసేదట. “ఇక జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమేననీ, దాన్ని మాత్రం కోల్పోవద్దనీ మా అమ్మ అంటుండేది” అని చెప్పుకొచ్చింది ఈశా డియోల్. బాలీవుడ్ సెలెబ్రిటీ కపుల్స్.. ధర్మేంద్ర – హేమమాలిని దంపతుల కుమార్తె ఈశా.
2002లో వచ్చిన ‘కోయీ మేరే దిల్సే పూఛే’ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. కుచ్తో హై, యువ, ధూమ్, కాల్, క్యాష్ లాంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 2012లో ముంబయికి చెందిన వ్యాపారవేత్త భరత్ తఖ్తానీని పెళ్లి చేసుకున్నది ఈశా డియోల్. భర్తతో మనస్పర్ధలు తలెత్తడంతో ఇటీవలే విడాకులు తీసుకొని.. 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలికింది.