భారతీయ చలన చిత్రసీమలో ఓ సువర్ణాధ్యాయానికి తెరపడింది. వెండితెరపై హీమ్యాన్‌గా, రొమాంటిక్, యాక్షన్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర (89) మహాభినిష్క్రమణం చెందారు. సోమవారం ఉదయం ముంబయిలోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 31న ధర్మేంద్ర ఆరోగ్యం విషమించడంతో ముంబయ్‌లోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ వార్తలు దేశమంతా వ్యాపించాయి.
ఆయన కోలుకోవాలని అశేష అభిమానలోకం ఆకాంక్షించింది. కానీ ఇంతలోనే ఆరోగ్యం విషమించడంతో ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన మరణవార్తతో బాలీవుడ్ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సాంఘిక మాధ్యమాల ద్వారా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులతో పాటు అశేష అభిమానులు తరలిరాగా ముంబయిలోని విల్లే పార్లే స్మశాన వాటికలో సోమవారం సాయంత్రం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి.
తెరపై స్మగ్లర్ల పాలిటి సింహస్వప్నం.. బందిపోట్ల కాలయముడు.. అమ్మాయిల మానసచోరుడు.. హీరోయిజానికి అసలు పేరు.. ధీరత్వానికి మారుపేరు.. వెండితెర రాబిన్‌హుడ్.. వెరసి ధర్మేంద్ర కెవల్ క్రిషన్ డియోల్. ఉరఫ్ ధర్మేంద్ర. అందుకే ప్రేక్షకులు ఆయన్ని ప్రేమతో ‘హీమ్యాన్’ అని పిలుచుకున్నారు.
బాలీవుడ్ తొలితరం హీరోలుగా దిలీప్‌కుమార్, రాజ్‌కపూర్, దేవానంద్లది ఓ తరం అయితే.. రాజేశ్‌ఖన్నా, ధర్మేంద్రలది మరో తరం. బాలీవుడ్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హీరోల్లో లెజెండ్ ధర్మేంద్ర ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు.
1935 డిసెంబర్ 8న పంజాబ్ లూథియానా జిల్లాలోని నస్రలీలో జన్మించిన ధర్మేంద్ర బాల్యం అంతా ఆ పక్కనే ఉన్న సహ్నేవాల్లో సాగింది. ఆయన తండ్రి కిషన్ సింగ్ డియోల్ అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. 1952లో ధర్మేంద్ర మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఫిల్మ్‌ఫేర్ పత్రిక నిర్వహించిన న్యూ టాలెంట్ పురస్కారానికి ఎంపికైన ఆయన.. సినిమాల్లో పనిచేయాలనే ఉత్సాహంతో పంజాబ్ నుంచి 1960లో ముంబై చేరారు. అదే ఏడాది విడుదలైన ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ నటుడిగా ఆయన తొలి సినిమా. అందులో ‘అశోక్’ అనే పాత్ర పోషించారాయన.
1960-67 మధ్య కాలంలో సూరత్ ఔర్ సీరత్, బందినీ, దుల్హన్ ఏక్ రాత్‌కీ, పూజా కే ఫూల్, బెహ్రన్ ఫిర్ భీ ఆయేంగే, ఆయే మిలన్ కి బేలా, మై భీ లడ్కీ హూ, కాజల్, పూర్ణిమా తదితర చిత్రాల ద్వారా రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. ఆ సమయంలో అమ్మాయిలు ఆయన్ని అమితంగా ఇష్టపడేవారు. అయితే.. ధర్మేంద్ర కెరీర్‌కి మేలి మలుపు మాత్రం ‘ఫూల్ ఔర్ పత్తర్’. 1966లో వచ్చిన ఈ సినిమా ధర్మేంద్రకు మాస్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. తొలిసారి అందులో ఆయన రాబిన్‌హుడ్ తరహా పాత్రను పోషించారు. ఆ ఏడాది బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. అందులోని నటనకు గాను, ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు ధర్మేంద్ర. ఆ సినిమా తెలుగులో ఎన్టీఆర్ హీరోగా ‘నిండుమనసులు’ పేరిట రీమేక్ అయి అఖండ విజయాన్ని అందుకుంది. తమిళలో ఎమ్జీయార్ సైతం ఆ సినిమాను రీమేక్ చేసి విజయాన్ని అందుకున్నారు. 1971లో వచ్చిన ‘మేరా గావ్ మేరా దేశ్’ చిత్రం ధర్మేంద్రను యాక్షన్ హీరోగా మరో మెట్టు మీద నిలబెట్టింది.
అప్పటికే మాస్ హీరోగా ఎదిగిన ధర్మేంద్రను గొప్ప నటుడిగా నిలబెట్టిన సినిమా ‘అనుపమ’. ఈ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇంకా ధర్మవీర్, చుప్కే చుప్కే .. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరీర్లో ఎన్నో ఆణిముత్యాలు. దాదాపు 300లకు పైచిలుకు చిత్రాల్లో నటించారాయన.
నటనకు రిటైర్మెంట్ అనేదే ఉండదని ప్రగాఢంగా నమ్మే వ్యక్తి ధర్మేంద్ర. అందుకే.. శరీరం సహకరిస్తున్నంత వరకూ నటిస్తూనే ఉంటానని ఆయన గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. చెప్పినట్టే అవకాశం వచ్చినప్పుడుల్లా నటిస్తూనే ఉన్నారు. ఆయన చివరి చిత్రం ‘ఇక్కిస్’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.

జోనర్ ఏదైనా తన పాత్రలో పరకాయప్రవేశం చేసేవారు ధర్మేంద్ర. దాదాపు 60 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘ నటప్రస్థానంలో 300 పైచిలుకు చిత్రాల్లో అనితరసాధ్యమైన నటనతో మెప్పించారు. వాటిలో ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించాయి. బలమైన దేహధారుడ్యం కలిగి ఉండటం వల్ల యాక్షన్ రోల్స్ ఆయనకు ‘హీ మ్యాన్’ అనే బిరుదుని తెచ్చి పెట్టాయి. 80దశకంలో ధర్మేంద్ర రోజుకి మూడు నాలుగు షిప్టుల్లో పనిచేసేవారు. ఒకే ఏడాదిలో (1987) ఏడు హిట్లు (లోహ, దాదాగిరి, హకుమత్, ఆగ్ హై ఆగ్, వతన్ కే రఖ్వాలే, ఇన్సాఫ్ కౌన్ కరేగా, మేరా కరమ్ మేరా ధరమ్) సాధించిన హీరోగా ధర్మేంద్ర రికార్డు సృష్టించారు. తన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్‌తో కలిసి ధర్మేంద్ర ఆప్నే, యమలా పగ్లా దీవానా వంటి చిత్రాల్లో నటించారు. సన్నీ డియోల్‌తో ఆయన నిర్మించిన ‘ఘాయల్’ చిత్రం బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ధర్మేంద్ర, గాయకుడు మహ్మద్ రఫీ కాంబినేషన్లో వచ్చిన పాటలు అలనాడు శ్రోతల్ని ఎంతగానో అలరించాయి. వారి కలయికలో వందకుపైగా పాటలు సంగీతప్రియుల్ని రంజింపజేశాయి.
1980-90దశకంలో బాలీవుడ్‌పై అండర్‌వరల్డ్ ప్రభావం ఎక్కువగా ఉండేది. చాలా మంది తారలు అండర్‌వరల్డ్‌తో రాజీ ధోరణితో ఉండేవారు. కానీ ధర్మేంద్ర మాత్రం వారి బెదిరింపులకు ఏనాడు లొంగలేదని చెబుతారు. ఎవరైనా ఆయన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తే ‘మీరు నాకు హాని తలపెట్టాలని ప్రయత్నిస్తే మా సహ్నేవాల్ గ్రామం (ధర్మేంద్ర సొంత ఊరు) మొత్తం ముంబయికి తరలివస్తారు. మీరు ఓ పదిమంది ఉంటారు కావొచ్చు..కానీ మా గ్రామం ఒక సైన్యంతో సమానం. నాతో అనవసరంగా పెట్టుకోకండి’ అంటూ ధర్మేంద్ర స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేవారని బాలీవుడ్లో ఆయన సన్నిహితులు చెబుతారు.
నాసిర్ హుస్సేన్ దర్శకత్వంలో 1973లో విడుదలైన ‘యాదోంకీ బారాత్’ బాలీవుడ్ సంచలన చిత్రాల్లో ఒకటి. సలీం-జావేద్ ద్వయం కథను అందించిన ఈ సినిమా అప్పటివరకూ ఉన్న బాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఇందులో యాంగ్రీ యంగ్‌మేన్‌గా ధర్మేంద్ర నటనకు జనం జేజేలు పలికారు. సినిమాకు బ్రహ్మరథం పట్టారు. బాలీవుడ్ సినిమా చరిత్రలోనే ‘యాదోంకీ బారాత్’ ఓ అధ్యాయం. ఈ కథ తెలుగులో ఎన్టీఆర్ హీరోగా ‘అన్నదమ్ముల అనుబంధం’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా అఖండ విజయాన్ని అందుకుంది. తమిళంలో ఎమ్జీయార్ కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు. ఈ సినిమాతో బాలీవుడ్లో నంబర్‌వన్ హీరోగా అవతరించారు ధర్మేంద్ర.
ధర్మేంద్ర, హేమమాలిని అప్పట్లో హిట్ పెయిర్. రాజా జానీ, సీతా ఔర్ గీతా, నయా జమానా, పత్తర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, జుగ్ను, దోస్త్, చరస్, చాచా భటిజా, అజాద్ చిత్రాల్లో వారిద్దరూ కలిసి నటించారు. ఇండియన్ క్లాసిక్ ‘షోలే’లోనూ వీరిద్దరే హీరోహీరోయిన్లు. వీరిద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా విజయం సాధించడం విశేషం. ఈ ప్రయాణంలోని పరిచయం ప్రేమగా మారి 1980లో హేమమాలినీని వివాహం చేసుకున్నారు ధర్మేంద్ర. అప్పటికే ఆయన వివాహితుడు. 1954లోనే ప్రకాష్ కౌర్‌తో ఆయన వివాహం జరిగింది. ధర్మేంద్రకు ఆరుగురు సంతానం. వారిలో సన్నీడియోల్, బాబీ డియోల్, ఇషా డియోల్, అహ్నా డియోల్ సినీ తారలుగా రాణిస్తున్నారు. వీరిలో ఇషా డియోల్, అహ్నా డియోల్.. హేమమాలినీకి పుట్టిన సంతానం. ఇంకా తొలి భార్య సంతానంగా విజేత, అజీత పేర్లతో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.
రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు ధర్మేంద్ర. 2004లో బికనీర్ నుంచి భారతీయ జనతాపార్టీ ఎంపీగా గెలుపొందారు. బాలీవుడ్ లెజెండ్‌గా సుదీర్ఘమైన నట ప్రస్థానాన్ని సాగించిన ధర్మేంద్రకు కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అంతేకాక, ఫిల్మ్‌ఫేర్ ‘లైఫ్ అఛీవ్మెంట్’ అవార్డును కూడా అందుకున్నారాయన.

ఇక ఇండియన్ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సినిమా అనగానే ముందు గుర్తొచ్చే పేరు ‘షోలే’. ఏళ్ల తరబడి థియేటర్లలో ఆడిన చరిత్ర ‘షోలే’ది. భారతీయ సినిమా అంటే ‘షోలే’కి ముందు ‘షోలే’కి తర్వాత అని చెప్పుకునే ఈ గొప్ప సినిమాలో కూడా కథానాయకుడు ధర్మేంద్రే. ఇందులో అమితాబ్ సెకండ్ హీరోగా నటించారు. తనకు ఆ పాత్ర రావడానికి కారకుడు ధర్మేంద్రేననీ, ఆయన పట్టుదల వల్లే తనకు ఆ క్యారెక్టర్ దక్కిందని అమితాబ్ చాలా వేదికల్లో చెప్పారు. అంతేకాదు, ధర్మేంద్రను తన గురువుగా భావిస్తారు అమితాబ్. ఆయనపై ఉన్న గురుభావాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు కూడా. ఏదేమైనా ‘షోలే’ చిత్ర కథానాయకుడిగా భారతీయ సినీ చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదించారు ధర్మేంద్ర.
‘భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ధర్మేంద్ర ఒకరు. ఆరు దశాబ్దాల పాటు అసమాన నటనతో ఆయన ప్రేక్షకుల్ని అలరించారు. మహోన్నత వ్యక్తిత్వంతో అలరారుతూ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’
-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ధర్మేంద్ర మరణంతో భారతీయ సినీరంగంలో ఒక శకం ముగిసింది. అనితరసాధ్యమైన నటనతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. అద్భుతాభినయంతో ఎన్నో పాత్రలకు వన్నె తెచ్చారు. ఉన్నత శిఖరాలకు ఎదిగినా.. వినయం, విధేయతతో సాటివారిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం ఆయనది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తూ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా’
– ప్రధాని నరేంద్ర మోదీ
‘ధర్మేంద్రగారు గొప్ప నటుడే కాదు..అంతకుమించిన మానవతామూర్తి. ఆయన్ని కలిసిన ప్రతీసారి ఆప్యాయత, అనురాగాలు నా హృదయాన్ని కదిలించేవి. ఆయనతో గడిపిన క్షణాల్ని కలకాలం గుర్తుంచుకుంటాను. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’
– చిరంజీవి