Jawan | సినిమాలు తీయడం కంటే జనాలను థియేటర్‌కి రప్పించటం ఇప్పుడు పెద్ద టాస్క్. దానికోసం దర్శక నిర్మాతలు, హీరోలూ పడుతున్న పాట్లు అన్నీఇన్నీకావు. పెద్ద పెద్ద సూపర్స్టార్లు సైతం ప్రేక్షకులతో ఇంటరాక్టవుతూ, వారితోపాటు చర్చల్లో పాల్గొంటూ హంగామా చేస్తే తప్ప ప్రేక్షకులు సినిమా గురించి ఆలోచించడం లేదు. బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్‌ఖాన్ సైతం ‘జవాన్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. రీసెంట్గా ఈ సినిమా కోసం సాంఘిక మాధ్యమంలో మాటామంతి నిర్వహించారు. ఇందులో అభిమానులడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు.
ఇదిలావుంటే.. ఈ మాటామంతి కార్యక్రమంలో ఓ యువకుడు షారుఖ్‌ని ‘జవాన్’ టికెట్లు ఫ్రీగా కావాలని అడిగాడు. ఉచితంగా రెండు టికెట్లిప్పిస్తే తన గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి సినిమాకెళ్తానని చెప్పాడు. దాంతో మన కింగ్‌ఖాన్‌కి చిర్రెత్తుకొచ్చింది. ‘ప్రేమ ఫ్రీగా దొరుకుతుందేమోగానీ.. టికెట్లు ఫ్రీగా దొరకవ్ బ్రదర్.. టికెట్ కావాలంటే పైసల్ పెట్టాల్సిందే. రొమాన్స్ కూడా ఛీప్‌గా దొరికేయాలంటే ఎలా?.. వెళ్లి డబ్బులిచ్చి టికెట్లు కొనుక్కొని, నీ గాళ్‌ఫ్రెండ్‌ని తీసుకెళ్లు. ఇద్దరూ సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి..’ అంటూ చురకలంటించారు షారుఖ్.