‘సీతారామం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో అందం, అభినయంతో మెప్పించింది. తాజాగా ఈ సొగసరి తెలుగులో నాని సరసన ఓ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. తెలుగులో ద్వితీయ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకుంటానని ధీమా వ్యక్తం చేసింది మృణాల్ ఠాకూర్. అదే సమయంలో ఏదో ఒక భాషకు పరిమితమైపోకుండా జాతీయ తారగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది.
ఆమె మాట్లాడుతూ ‘నేను తొలుత హిందీ ధారావాహికల్లో నటించా. అనంతరం సినిమాలు చేశాను. ‘సీతారామం’ చిత్రంతో తెలుగులో బ్రేక్ దొరికింది. భవిష్యత్తులో దక్షిణాది అన్ని భాషల్లో నటించాలనుంది. ప్రస్తుతం సినిమాల ఎంపికలో ప్రేక్షకుల అభిరుచులు మారాయి. ఓటీటీల వల్ల గ్లోబల్ కంటెంట్ చూస్తున్నారు. అందుకే నాయికలు కూడా అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ జాతీయ తారలుగా ఎదగాలి. నా ఆశయం కూడా అదే’ అని చెప్పింది.