Disha Patani | ‘లోఫర్’లో కనిపించిన ఆ సూపర్ సుందరాంగిని తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ కళ్లకు కనికట్టు తెలుసు. ఆ చూపులకు ఇంద్రజాలం వచ్చు. కాబట్టే, బాలీవుడ్ ఆ బంగారు బొమ్మను ఎగరేసుకుపోయింది. అయితేనేం, తను నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కే’లో ప్రభాస్ పక్కన అవకాశం దక్కించుకుంది. అన్నీ కుదిరిదే.. వచ్చే సంక్రాంతికి దిశా పఠానీని తెలుగు తెరపై చూడబోతున్నాం. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దిశ చాలా విషయాలే చెప్పింది..
మా ఇంట్లో మిలిటరీ డిసిప్లిన్ ఉండేది. ఆ క్రమశిక్షణ ముంబైకి వచ్చాక చాలా పనికొచ్చింది. ఒక్కసారిగా గడపదాటేసి బయటి ప్రపంచంలో అడుగుపెట్టగానే.. బోలెడంత స్వేచ్ఛ లభించిన అనుభూతి. చుట్టూ ఖరీదైన స్నేహితులు, పబ్‌లు, పార్టీలు. కానీ, ఇవేవీ నన్ను ఆకట్టుకోలేదు. చాలా క్రమశిక్షణగా బతికాను. పక్కా ప్రొఫెషనల్‌గా వ్యవహరించాను.
మా నాన్న పోలీస్ ఆఫీసర్. చదువుల్లోనే కాదు..ఆట పాటల్లో కూడా అమ్మాయిలు ముందుండాలని నాన్న కోరిక. దీంతో తనకు తెలిసిన విద్యలన్నీ మాకు బోధించారు. కారు రిపేరు చేయడమూ నేర్పించారు. ఎక్కడైనా బండి ఆగిపోతే.. నేనే రంగంలో దిగుతాను. ఈ విషయంలో నాన్నకు థ్యాంక్స్ చెప్పాలి.
‘ప్రపంచంలో అత్యంత అందమైన వ్యక్తి ఎవరు?’ అని అడిగితే మా అమ్మే అంటాను. అంత అందగత్తె! తన మనసు కూడా అంతే అందమైంది. సినిమాల్లో నటించాలనే తన కోరిక తీరనేలేదు. జీవితానికి ఓ లక్ష్యం ఉండాలని
నాతో చెప్పేది. దీంతో సైంటిస్ట్ కావాలని నిర్ణయించుకున్నా.
లక్నోలో కాలేజీ జీవితం నా ఆలోచనల్ని మార్చేసింది. ఓ స్నేహితురాలు నాకు తెలియకుండానే అందాల పోటీలకు నా పేరు ఇచ్చింది. బలవంతంగా నాతో క్యాట్‌వాక్ చేయించింది. అందాల కిరీటం రావడం, మాడలింగ్ అవకాశాలు వెల్లువెత్తడం.. అంతే, రాత్రికి రాత్రి నా ప్రపంచం మారిపోయింది. కెమెరా ముందు నిలబడగానే నా బిడియాన్ని వదిలేస్తాను. తెలుగు చిత్రం ‘లోఫర్’తో నా కెరీర్ మొదలైంది. ‘కుంగ్ ఫూ యోగా’ లో జాకీ చాన్‌తో కలిసి నటించడం మరువలేని అనుభవం.
చిన్నప్పుడు నేను చాలా సిగ్గరిని. ఆ బిడియం వల్ల కావచ్చు. బడికి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. క్లాస్‌లో స్నేహితులే ఉండేవారు కాదు. బక్కపలచగా, బలహీనంగా ఉన్న పిలకజుట్టు పిల్లతో ఎవరు మాత్రం స్నేహం చేస్తారు చెప్పండి? మా చెల్లికి మాత్రం సెలెబ్రిటీ స్టేటస్ ఉండేది. లంచ్ తనతో కలిసి చేసేదాన్ని.
Disha Patani1
ఫలితాల గురించి నేను పట్టించుకోను. జయాపజయాలు నన్ను ప్రభావితం చేయలేవు. గతంతో, భవిష్యత్తుతో సంబంధమే లేనట్టు వ్యవహరిస్తాను. ఈ క్షణంలో జీవిస్తాను. ఈ నిమిషాన్ని ఆస్వాదిస్తాను. ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు ఆ పాత్రలో లీనమైపోతాను. దర్శకుడు, హీరో, కొరియోగ్రాఫర్.. ప్రతి ఒక్కరి నుంచీ ఎంతకొంత నేర్చుకుంటాను. సినిమా సక్సెస్‌తో లభించే ఆనందం కంటే, ఆ అనుభూతే విలువైంది నాకు. ‘జీవితం చాలా చిన్నది. నీకు నువ్వు నిజాయతీగా లేకపోతే చాలా కోల్పోతావు’ అనేదే నా జీవన విధానం .
పెళ్లి అంటారా.. జరగాల్సిన సమయంలో తప్పక జరిగిపోతుంది. ప్రస్తుతానికి ఆ ఆలోచనల్లేవు. పెళ్లి తర్వాత నటిస్తారా? అని కూడా అడుగుతారుగా మీరు. అడగండి. నా దగ్గర జవాబు సిద్ధంగా ఉంది. ఒకరి భార్య కావడం అనేది నా జీవితంలో సగ భాగమే. నాకంటూ కలలు ఉన్నాయి. సాధించాల్సిన లక్ష్యాలున్నాయి. అవన్నీ నా జీవితంలో మిగతా సగం.
“Disha Patani | చిట్టిపొట్టి దుస్తుల్లో మతులు పోగొడుతున్న దిశా పటానీ..”