‘యానిమల్’ సినిమాతో బాబీ డియోల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే, ఆ సినిమావల్ల హీరో రణ్‌బీర్‌కపూర్‌కు ఎంత పేరొచ్చిందో, బాబీ డియోల్‌కి కూడా అంతే పేరొచ్చింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ‘యానిమల్’లోని బాబీడియోల్ సీన్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సదరన్ సినిమాపై దృష్టి సారించిన బాబీ డియోల్.. పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వస్తున్న ఎన్బీకే 109 చిత్రాలతో పాటు తమిళంలో సూర్య చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘కంగువా’లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సూర్య ‘కంగువా’లోని తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘తమిళంలో ఇది నా తొలి సినిమా. ఇప్పటివరకూ ఈ తరహా పాత్ర చేయలేదు. ఇది నాకొక ఛాలెంజ్. పైగా ఈ పాత్ర నా కంఫర్ట్ జోన్లో లేదు. ఎందుకంటే నాకు తమిళం రాదు. అందుకే ఈ పాత్ర కోసం రెండు నెలలు తమిళం నేర్చుకున్నాను. సూర్య అద్భుతమైన నటుడు. అలాంటి అంకితభావం ఉన్న నటుడితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో కొత్త బాబీడియోల్ని చూస్తారు.’ అని చెప్పుకొచ్చాడు బాబీ డియోల్.