Michael Jackson | దివంగత పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనున్నది. ఈ సినిమాలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించనున్నారు. గ్రాహం కింగ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. జాఫర్ చాలా కాలంగా మైఖేల్ పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించి జాఫర్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను జీకే ఫిల్మ్స్ షేర్ చేసింది. ఈ ఫొటోలో మైఖేల్ జాక్సన్ అవతారంలో జాఫర్ పూర్తిగా మునిగిపోయి కనిపించాడు.
మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ కో ఎగ్జిక్యూటర్, ఎంటర్టైన్మెంట్ లాయర్ అయిన జాన్ బ్రాంకా.. మైఖేల్ బయోపిక్‌లో ప్రధాన పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ పోషిస్తున్నట్లు వెల్లడించే వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మైఖేల్ జాక్సన్‌తో జాఫర్‌కు ప్రత్యేక అనుబంధం ఉన్నదని బ్రాంకా చెప్పారు. జాఫర్‌ని చూడగానే అచ్చం మైఖేల్‌ను చూసినట్లుగా భావించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. చిన్న వయసు నుంచే మైఖేల్‌ను ఫాలో అవుతున్నందున వాకింగ్ స్టైల్ ఒక్కటే కాకుండా వాయిస్ కూడా అచ్చం మైఖేల్‌ని పోలి ఉంటుందన్నారు. ఈ పాత్ర కోసం జాఫర్ గత 6 నెలలుగా కష్టపడుతున్నాడని బ్రాంకా ఆ వీడియోలో వెల్లడించారు.
‘రెండేండ్ల క్రితం నేను జాఫర్‌ని కలిశాను. అతను మైఖేల్ వ్యక్తిత్వాన్ని పూర్తిగా అవపోసన పట్టినట్లు గుర్తించాను. అతడి నైపుణ్యాలను చూసి చాలా ఆకర్శితుడినయ్యాను. మైఖేల్ జాక్సన్ ఎంతో శక్తిమంతమైన వ్యక్తి. ప్రపంచం మొత్తం వెతికినా అతడి పాత్రను పోషించడానికి జాఫర్ రూపంలో ఒక వ్యక్తి దొరికాడు’ అని గ్రాహం కింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, మైఖేల్ జాక్సన్ కథను ప్రపంచానికి అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. గర్వంగా కూడా ఫీలవుతున్నాను. త్వరలో మనం కలుద్దాం అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైఖేల్ జాక్సన్ అభిమానులందరికీ చెప్పాలనుకుంటున్నా’ అని ఇన్‌స్టాగ్రాంలో జాఫర్ జాక్సన్ తెలిపారు.