Bigg Boss Lobo | ప్రముఖ టీవీ నటుడు, యాంకర్, బిగ్‌బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్ లోబోకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడేళ్ల క్రితం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం కేసులో జనగామ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించి లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. 2018, మే 21న టీవీ కార్యక్రమానికి సంబంధించి వీడియో షూట్ కోసం లోబో తన టీమ్‌తో కలిసి వరంగల్ జిల్లా లోని లక్నవరం, రామప్ప, భద్రకాళి చెరువు వంటి పర్యాటక ప్రాంతాల్లో పర్యటించాడు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతూ, లోబో స్వయంగా కారు నడుపుతూ వస్తున్న సమయంలో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
లోబో కారు ఆటోని ఢీకొట్టిన క్రమంలో ఆటోలో ఉన్న ప్రయాణికులు మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అదే ఆటోలో ఉన్న మరికొందరికి కూడా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లోబో టీమ్ ప్రయాణిస్తున్న కారు కూడా బోల్తా పడింది. దీంతో వారికీ స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు లోబోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏడేళ్ల పాటు న్యాయపోరాటం కొనసాగిన ఈ కేసులో జనగామ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇద్దరి మృతి చెందడంతో పాటు ఇతరులకు గాయాలకు కారణమైన లోబోకి ఏడాది పాటు జైలు శిక్ష విధించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, రూ.12,500 జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుపై లోబో నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే, అతడు పైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తపై విస్తృత చర్చ జరుగుతోంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఎంతటి నష్టం జరిగే అవకాశముందో ఈ కేసు గుర్తుచేస్తోంది.