Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్లు విష్ణుప్రియ, రీతూచౌదరి విచారణ ముగిసింది. ఇద్దరినీ పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను దాదాపు పది గంటలు, రీతూ చౌదరిని దాదాపు ఆరుగంటలకుపైగా పోలీసుల విచారణ సాగింది. విచారణ సమయంలో మూడు బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేసినట్లు విష్ణుప్రియ పోలీసులకు తెలిపింది. అయితే, తమకు 15 యాప్‌లకు ప్రచారం చేసినట్లు సమాచారం ఉందని పోలీసులు పేర్కొన్నారు. తనకు కేవలం మూడు ఒప్పందాలు మాత్రమే గుర్తున్నాయని చెప్పినట్లు సమాచారం. యాప్స్ ప్రమోషన్ చేస్తే వచ్చిన డబ్బుల గురించి సైతం వివరాలు ఆరా తీసినట్లు తెలుస్తున్నది. డబ్బులు అందిన అకౌంట్ల స్టేట్మెంట్ల వివరాలను పోలీసులు అడిగినట్లు సమాచారం. మరోసారి విచారణకు హాజరయ్యే సమయంలో బ్యాంక్ స్టేట్మెంట్లు వెంట తీసుకురావాలని సూచించినట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు ఏపీ, తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు జారీ చేసిన నోటీసులు మేరకు.. విష్ణుప్రియ, రీతూ చౌదరి గురువారం విచారణకు హాజరయ్యారు. గతేడాది తాను ప్రమోషన్ చేశానని, ప్రస్తుతం అవి వైరల్ అయ్యాయని రీతూ చౌదరి పేర్కొంది. అలాగే, విష్ణుప్రియ స్టేట్మెంట్ని సైతం పోలీసులు రికార్డు చేశారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఒక్కో యాప్ ప్రమోషన్‌కు రూ.90వేల వరకు తీసుకున్నట్లుగా గుర్తించారని.. ఈ విషయాన్ని విష్ణుప్రియ సైతం అంగీకరించినట్లు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బెట్టింగ్ ప్రమోషన్ చేసిందని పోలీసులు గుర్తించగా.. ఎంత ఫీజు వసూలు చేశారు.. ఏయే ఖాతాలకు బదిలీ చేశారన్న దానిపై స్టేట్మెంట్ కోరినట్లు సమాచారం. విచారణ తర్వాత విష్ణుప్రియ మొబైల్‌ను పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్‌ని సైతం పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. త్వరలోనే మిగతా వారికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలువనున్నట్లు సమాచారం.