AR Rahman | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) తన భార్య సైరా భాను (Saira Banu)తో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రెహమాన్ మ్యూజిక్ బృందంలోని బాసిస్ట్ మోహినీ దే (bassist Mohini Dey) కూడా తన భర్తతో విడాకులు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరి మధ్య సంబంధం ఉందని అందుకే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై మోహిని మరోసారి స్పందించారు. రెహమాన్ తనకు తండ్రిలాంటి వారని చెప్పుకొచ్చారు.
తనది, రెహమాన్ కుమార్తెలది ఒకే వయసు అని.. ఆయనెప్పుడూ తనని కుమార్తెలానే చూసేవారని తెలిపింది. ఎనిమిదేళ్లుగా ఆయన బృందంలో పనిచేస్తున్నట్లు తెలిపింది. రెహమాన్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేసింది. ఆయన తనకు తండ్రితో సమానమని స్పష్టం చేసింది. తన కెరీర్లో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించింది. అలాంటి తమపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సున్నితమైన అంశాల్లో సానుభూతి లేకుండా నిందలు వేయడం సరికాదని పేర్కొంది. ఇక్కడితో ఈ రూమర్స్‌కు పుల్‌స్టాప్ పెట్టి.. తమ గోప్యతను గౌరవించాలని కోరింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది.
ఏఆర్ రెహమాన్ 1995లో సైరా భానును వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ఇద్దరూ పరస్పర అంగీకారంతో ముగింపు పలికారు. ఇక ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలకు పెళ్లయ్యింది. వైవాహిక బంధంలో ఏర్పడిన భావోద్వేగ క్షణం తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఏఆర్ రెహమాన్ న్యాయవాది తెలిపారు. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నా.. ఉద్రిక్తలు, ఆందోళనలు వారి మధ్య గ్యాప్‌ను పెంచాయని.. ఆ అగాధాన్ని పూడ్చేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరన్నారు.
Also Read..
Samantha | నన్ను సెకండ్ హ్యాండ్ అన్నారు.. డివోర్స్ తర్వాత ఎన్నో ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నా : సమంత
Vetrimaaran | వెట్రిమారన్ డబుల్ ట్రీట్.. విడుదల పార్ట్ 2 ట్రైలర్, ఆడియో లాంచ్ టైం ఫిక్స్
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!