Bandla Ganesh | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అనూహ్యంగా భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం టీవీకే 100కు పైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉండటంతో, దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే–ఏఐఏడీఎంకే రాజకీయ సమీకరణాలు కుదేలవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన, హీరోయిన్ త్రిషను ట్యాగ్ చేస్తూ “ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది… కంగ్రాట్స్ త్రిష” అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ద్వారా విజయ్ విజయం మాత్రమే కాకుండా త్రిష రాజకీయ ఆశయాలను కూడా సూచించారని నెటిజన్లు భావిస్తున్నారు.
త్రిష కృష్ణన్ గతంలోనే విజయ్ రాజకీయ ప్రయాణానికి తన మద్దతు ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రిగా అవ్వాలని తన కోరిక అని పలు సందర్భాల్లో వెల్లడించారు. అంతేకాకుండా, సుమారు 15 ఏళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను కూడా భవిష్యత్తులో సీఎం కావాలని ఉందని చెప్పిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇప్పుడు విజయ్ విజయపథంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో త్రిష కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశంపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
ఇదే సమయంలో త్రిష పుట్టినరోజు (మే 4) రోజున తిరుమలలోని తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం విశేషంగా మారింది. ఎన్నికల ఫలితాల రోజే ఆమె దర్శనం చేసుకోవడంతో, విజయ్ విజయానికి ఆమె మొక్కులు చెల్లించిందా అన్న చర్చలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. విజయ్ పార్టీ ఘనవిజయం సాధిస్తే, త్రిష టీవీకేలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే, తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ తార ఎంట్రీకి నాంది పడే అవకాశం ఉంది. మొత్తానికి టీవీకే ప్రభంజనం, విజయ్ సీఎం అయ్యే అవకాశం, త్రిష రాజకీయ ఎంట్రీ ఈ మూడు అంశాలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. రాబోయే ఫలితాలు ఈ ఊహాగానాలకు ఎంతవరకు బలం చేకూరుస్తాయో చూడాల్సి ఉంది.