Bandla Ganesh | ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు మరోసారి సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ అరెస్ట్ వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు, వాటికి నిర్మాత బండ్ల గణేష్ ఇచ్చిన ఘాటు కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇద్దరు సినీ ప్రముఖులు ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకోవడంతో ఈ వివాదం రాజకీయాల నుంచి సినీ వర్గాల వరకు విస్తరించింది. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు స్పందించిన ప్రకాష్ రాజ్.. తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభుత్వ తీరును విమర్శించారు.
తన పోస్టులో “మీరు ఆట మొదలు పెట్టారు… ప్రజలు దానికి ముగింపు ఇస్తారు. Game On” అంటూ వ్యాఖ్యానించారు. వరుసగా కేసులు నమోదు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ వెంటనే స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన, సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.తన పోస్టులో ప్రకాష్ రాజ్‌కు ప్రస్తుతం సినిమాలు, షూటింగ్‌లు లేవని వ్యాఖ్యానిస్తూ, ఇతరుల గురించి మాట్లాడటం కంటే తన పనిని చూసుకోవాలని సూచించారు. అనవసర పోస్టులు, వివాదాలతో తన ప్రతిష్ఠను తానే దెబ్బతీసుకోవద్దని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రాత్రి తాగుతావు… పొద్దున్నే వాగుతావు… అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు. ఒక వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ లేదు. పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు… ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని నీ విలువను నువ్వే తగ్గించుకోకు అని బండ్ల గణేష్ పోస్టు చేశాడు. ఈ వివాదంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన మద్దతుదారులు బండ్ల గణేష్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ప్రకాష్ రాజ్‌పై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా నిలుస్తున్న వారు మాత్రం ఆయన భావప్రకటన స్వేచ్ఛలో భాగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారని, వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.