అగ్ర హీరో బాలకృష్ణ తన 111వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ‘ఎన్బీకే 111’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా కాన్సెప్ట్ విషయంలో భిన్న కథనాలు ప్రచారంలో వచ్చాయి. భారీ విజువల్ హంగులతో రూపొందనున్న సోషియో ఫాంటసీ చిత్రమని వార్తలొచ్చాయి.
తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది. ముంబయి మాఫియా నేపథ్యంలో పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ కథను తయారుచేశారట. ఇందులో బాలకృష్ణ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. మార్చి తొలివారంలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, నిర్మాణం: వృద్ధి సినిమాస్.