‘బలగం’ సినిమాలో చిన్న తాత పాత్ర పోషించిన రంగస్థల నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. జీవీ బాబు రంగస్థల నటుడిగా పేరు ప్రఖ్యాతుల్ని సాధించారు. ఆయన మరణం పట్ల తెలంగాణకు చెందిన పలువురు సినీ, నాటకరంగ కళాకారులు సంతాపం వెలిబుచ్చారు.
‘బలగం’ చిత్ర దర్శకుడు వేణు యల్దెండి తన ఎక్స్(ట్విటర్)లో జీవీ బాబు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘జీవీ బాబు ఇకలేరు. తన జీవితాన్ని నాటకరంగానికే అంకితం చేశారాయన. చివరిరోజుల్లో ఆయన్ను ‘బలగం’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.’అని ట్విటర్లో పోస్ట్ చేశారు దర్శకుడు వేణు యల్దెండి.