Bala Krishna | నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. బాలయ్య ఈ పురస్కారం అందుకోవడం పట్ల అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తనకి ఈ పురస్కారం అందించినందుకు అభిమానులకు, భారత ప్రభుత్వానికి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతుంటారని, అయితే తనకు సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చిందని బాలయ్య స్పష్టం చేశారు.
పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న తర్వాత బాలయ్యని జాతీయ మీడియా ఇంటర్వ్యూ చేయగా, ఆయన తనని తాను పరిచయం చేసుకున్న తీరు అందరిని ఆకట్టుకుంది. నా పేరు బాలకృష్ణ…నేను ఎన్టీఆర్ కుమారుడిని…మా ఇంటి పేరు నందమూరి అంటూ చాలా వినయంగా పరిచయం చేసుకున్నారు. తెలుగులో స్టార్ హీరో, శాసన సభ్యుడిగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన కూడా ఉత్తరాది వారికి బాలయ్య పెద్దగా తెలియదు కాబట్టి ఆయన ఈ విధంగా పరిచయం చేసుకున్నారు. త్వరలో తాను చేయబోయే సినిమాల గురించి వివరించారు. ఇక హిందూపూర్ శాసనసభ నుండి మూడు పర్యాయాలు విజయం సాధించిన బాలయ్య అక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకొచ్చారు.
తెలుగు చిత్ర సీమలో తనది 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం అని చెప్పిన బాలకృష్ణ… త్వరలో హిందీ సినిమా చేయాలనే కోరికని వెల్లడించాడు. ఇక తనకి చాలా అభిమాన సంఘాలు ఉన్నాయని, రిజిస్టర్డ్ ఫ్యాన్స్ తనకు ఉన్నట్టు వేరే వారికి లేరని, అభిమానుల ఫోన్ నెంబర్స్ కూడా నా దగ్గర ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వారితో మాట్లాడతానంటూ బాలయ్య స్పష్టం చేశారు. ఇంత స్థాయికి చేరిన తర్వాత కూడా బాలయ్య తనని తాను అలా పరిచయం చేసుకోవడం అభిమానులకి చాలా చూడముచ్చటగా అనిపించింది. ఇక త్వరలో అఖండ2 చిత్రంతో పలకరించబోతున్నారు బాలయ్య. ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.