Avatar 2 records |అవతార్ 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఉరుములతో కూడిన ప్రారంభానికి తెరతీసింది. ఈ సినిమా తొలి రోజు రూ.41 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ దాదాపు రూ.45 కోట్లు దాటింది. ఇక గ్రాస్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమా రెండు రోజుల్లోనే ఇండియన్ బ్యాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు వసూల్ చేసింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు రూ.1700 కోట్లు దాటినట్లు సినిమా మార్కెట్ వర్గాల సమాచారం.
అవతార్ 2 సినిమా అంతటా అదరగొడ్తున్నది. ఎక్కడ చూసినా ప్రేక్షక జనం నీరాజనాలు పడుతున్నారు. మొదటి వారాంతంలో రూ.130 నుంచి రూ.140 కోట్ల వరకు బిజినెస్ చేయగలదని అంచనా వేస్తున్నారు. సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొన్నది. దాదాపు రూ.2 వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ట్రేడ్ పండితుల నుంచి విమర్శకుల వరకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమా మన దేశంలో డిసెంబర్ 16 న విడుదలైంది. మన దేశంలో ఇంగ్లిష్, హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల చేశారు.
అవతార్ మొదటి రోజు రూ.41 కోట్లు వసూలు చేసినప్పటికీ, అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమా తొలి రోజు వసూళ్ల కంటే చాలా వెనుకబడి ఉన్నది. అవెంజర్స్ ఎండ్‌గేమ్ చిత్రం విడుదలైన తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.52 కోట్లు రాబట్టింది. ఏ హాలీవుడ్ సినిమాకైనా భారతదేశంలోనే ఇదే అత్యధిక తొలిరోజు కలెక్షన్లు సాధించిన రికార్డు. అవతార్ 2 కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. స్పైడర్‌మ్యాన్ రూ.32.75 కోట్లు, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ రూ.31.25 కోట్లు, డాక్టర్ స్ట్రేంజ్ రూ.28.75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.