రైతు సాగు చట్టాల అమలు గురించి సినీ నటి , బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలన్నీ కంగనా రనౌత్ తీరుని తప్పుబట్టాయి. ఆమె వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణలు చెబుతున్నట్లు కంగనా రనౌత్ బుధవారం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపింది. ‘నేను బీజేపీ కార్యకర్తను. నా మాటలను పార్టీకి సంబంధించిన స్టాండ్‌గానే చూడాలి. నా వ్యక్తిగత అభిప్రాయంగా పరిగణించవొద్దు. ఒకవేళ నా మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమాపణ కోరుతున్నా. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా’ అని ట్విట్టర్లో విడుదల చేసిన వీడియోలో కంగనా రనౌత్ పేర్కొంది. కొద్ది రోజుల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం మండీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న కంగనా రనౌత్ సాగు చట్టాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కొన్ని రాష్ర్టాల్లో మాత్రమే సాగు చట్టాలపై వ్యతిరేకత వస్తున్నది కాబట్టి వాటిని అమలు చేసే విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని కోరింది. ఆమె వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో తాజాగా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు కంగనా రనౌత్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.