అగ్ర కథానాయిక అనుష్కశెట్టి నటిస్తున్న తొలి మలయాళ చిత్రం ‘కథనార్’. పీరియాడిక్ హారర్ థ్రిల్లర్ కథాంశమిది. జయసూర్య టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకుడు. తొమ్మిదవ శతాబ్దం తాలూకు నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల అనుష్కశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె ‘నీలా’ అనే ఆత్మ పాత్రలో కనిపిస్తుందని, నెగెటివ్ ఛాయలతో ఈ పాత్ర సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో నటించడం పట్ల పలు ఇంటర్వ్యూల్లో అనుష్కశెట్టి ఆనందం వ్యక్తం చేసింది.
సుదీర్ఘ కెరీర్లో ఇప్పటివరకూ చేయని విభిన్న పాత్రను పోషిస్తున్నానని, ఇది మలయాళంలో తన కెరీర్‌కు శుభారంభాన్నిస్తుందని చెప్పింది. అతీత శక్తులు కలిగిన నీలా అనే మహిళగా ఆమె పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని చెబుతున్నారు. ‘కథనార్’లోని ఆమె ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. అనుష్క తాజా తెలుగు చిత్రం ‘ఘాటీ’ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.