అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డ్ అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ‘జానకి’ అనే పేరును మార్చాలని సెన్సార్ బోర్డ్ సూచించింది. వేధింపులు, దాడి ఘటనలు ఎదుర్కొన్న ఓ మహిళ చేసే పోరాటం నేపథ్యంలో కోర్ట్‌రూమ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జానకి పాత్రను పోషించింది అనుపమ పరమేశ్వరన్. న్యాయవాదిగా సురేష్‌గోపి నటించారు.
ప్రవీణ్ నారాయణ్ దర్శకుడు. కథానాయిక పాత్ర తీరుతెన్నుల దృష్ట్యా సీతాదేవికి మరో పేరైన జానకి పేరును ఆ పాత్రకు ఉపయోగించడం సబబుగా లేదని సెన్సార్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ జారీచేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ చిత్ర నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో సెన్సార్ బోర్డ్ వైఖరిని హైకోర్టు తప్పుబట్టింది. గతంలో జానకి పేరుతో ఎన్నో సినిమాలు, పాత్రలు వచ్చాయని, అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించింది. కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. సెన్సార్ అభ్యంతరం వల్ల ఈ నెల 27న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది.