తాండవ్ కాంట్రవర్సీ.. లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదు

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ తాండవ్. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ని అలీ అబ్బాస్‌తో కలిసి హిమాన్షు కిశన్ మెహ్రా నిర్మించారు. డింపుల్ కపాడియా, సునీల్ గ్రోవర్, తిగ్మన్షు ధులియా, గౌహర్ ఖాన్ తదితరులు నటించారు. హిందువుల మనోభావాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ వెబ్ సిరీస్ ఉందని దీనిని వెంటనే బ్యాన్ చేయాలంటూ ‘బాయ్‌కాట్ తాండవ్’, ‘బ్యాన్ తాండవ్’ హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ చేస్తున్నారు.
‘తాండవ్’లో హిందు దేవుళ్లను కించపరిచారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌కదమ్ ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కు లేఖ కూడా రాశారు. ఇందులో దేవుళ్ళను ఎగతాళి చేయడమే కాక, శృంగారం, హింస, మాదక ద్రవ్యాల వాడకం వంటి ఎక్కువగా చూపించి యువతను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తాజాగా లక్నోలో కూడా తాండవ్ యూనిట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ క్రమంలో కేంద్ర ప్రసారమంత్రిత్వశాఖ అమెజాన్ ప్రైమ్ వీడియోకు సమన్లు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ వెబ్ సిరీస్‌కు బ్రేకులు పడేలా కనిపిస్తున్నాయి. కాగా, జనవరి 4వతేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో తాండవ్ ట్రైలరును విడుదల చేసిన సంగతి తెలిసిందే.