Ananya Nagalla | ఇంట గెలిచి రచ్చ గెలవమనేది ఆర్యోక్తి. మన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఆ మాటను నిజం చేస్తూ.. ముందు ఇంటను గెలిచి.. ఇప్పుడు రచ్చను గెలిచేందుకు సమాయత్తమవుతున్నది. మల్లేశం, వకీల్‌సాబ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య.. ఆ తర్వాత ప్లేబ్యాక్, తంత్ర, పొట్టేల్, బహిష్కరణ(వెబ్ సిరీస్) వంటి ప్రాజెక్టులతో మంచి నటిగా కూడా కితాబులందుకున్నది.
త్వరలో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంది. ఏక్తా ఫిల్మ్ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై హిమ్మత్ లడుమోర్ నిర్మాణంలో ఓ విమన్ సెంట్రిక్ మూవీ చేస్తున్నది అనన్య నాగళ్ల. ఈ చిత్రానికి రాకేష్ జగ్గి దర్శకుడు. ఇందులో అనన్య ట్రైబల్ లేడీగా కనిపిస్తుందని సమాచారం. ‘కాంత’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నారు. ముంబయ్ హీరోయిన్లు టాలీవుడ్లో పాగా వేస్తున్న నేటి తరుణంలో ఓ తెలుగమ్మాయి బాలీవుడ్ సినిమాలో లీడ్ రోల్ చేయడం నిజంగా తెలుగువారందరికీ గర్వకారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.