‘సంక్రాంతి’ పండుగలోని ఎనర్జీ అంతా ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో ఉంటుంది. ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించే సినిమా ఇది. ఫ్యామిలీ అంతా హాయిగా కలిసి చూసే పర్ఫెక్ట్ పండుగ సినిమా అనమాట. బుకింగ్స్ చాలా బావున్నాయి. మిమ్మల్ని తప్పకుండా అలరించే సినిమా అవుతుంది.’ అని హీరో నవీన్ పొలిశెట్టి చెప్పారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి కథానాయిక. మారి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ నెల 14న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సినిమా ప్రీరిలీజ్ ప్రెస్మీట్లో నవీన్ పొలిశెట్టి మాట్లాడారు.
తామంతా ఇష్టంతో కష్టపడి చేసిన సినిమా ఇదని, సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉంటారనీ, మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని కథానాయిక మీనాక్షి చౌదరి అన్నారు. బాధలన్నింటినీ మరపించి, రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించే పర్ఫెక్ట్ సంక్రాంతి చిత్రమిదని డైరెక్టర్ మారి నమ్మకంగా చెప్పారు. ‘ఇదో గోదావరి నేపథ్యంతో కూడిన అందమైన కథ. నవీన్ శైలిలో సరదాగా ఉంటుంది. సినిమా ఎంత నవ్విస్తుందో, చివర్లో అంత ఎమోషన్‌కి గురిచేస్తుంది. ఈ గ్రామీణ చిత్రంలో చిన్న పొలిటికల్ సెటైర్ కూడా ఉంటుంది. అన్ని అంశాలతో కూడిన అసలైన పండుగ సినిమా ఇది.’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. ఇంకా బాలనటుడు రేవంత్ కూడా మాట్లాడారు.