Amitabh Bachchan | బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఫ్యామిలీ గత కొంత కాలంగా రియల్ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ముంబై (Mumbai) సహా పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తోంది. గత 20 ఏళ్లలో బచ్చన్ ఫ్యామిలీ ఏకంగా రూ.200 కోట్లు రియల్ ఎస్టేట్ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అమితాబ్ ఫ్యామిలీ తాజాగా ఒకేసారి పది ఫ్లాట్స్‌ను కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నివేదిక ప్రకారం.. అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ముంబైలోని ములుంద్ వెస్ట్ (Mulund West)లో రూ.25 కోట్ల విలువైన రెసిడెన్షియల్ ప్రాపర్టీస్‌ను కొనుగోలు చేశారు. ఇవి ముంబైలోని ములుంద్ ప్రాంతంలో గల ఒబెరాయ్ రియాల్టీకి చెందిన ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, ఎటర్నియాలో ఉన్నాయి. మొత్తం 10 ఫ్లాట్స్‌ను ఒకేసారి కొనుగోలు చేశారు. వీటి విలువ దాదాపు రూ.24.95 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్స్ రెడీ టు మూవ్ కండీషన్లో ఉన్నట్లు తెలిసింది.
ఈ ఫ్లాట్స్ మొత్తం 10,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ప్రతి ఫ్లాట్‌కు రెండు కార్ పార్కింగ్ స్థలాలు ఉంటాయి. అక్టోబర్ 9న రిజిస్ట్రేషన్ కూడా పూర్తైనట్లు సదరు నివేదిక పేర్కొంది. ఈ డీల్ కోసం మొత్తం రూ.1.50 కోట్లు స్టాంప్ డ్యూటీ కింద తండ్రీ కొడుకులు చెల్లించినట్లు వెల్లడించింది. ఇక మొత్తం 10 అపార్ట్‌మెంట్స్‌లో రూ.14.77 కోట్ల విలువైన ఆరు ఫ్లాట్స్ అభిషేక్ బచ్చన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించగా.. మిగతా నాలుగు అపార్ట్మెంట్స్ బిగ్‌బీ పేరు మీద కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
Also Read..
Elephant | ఏనుగుతో సెల్ఫీ కోసం యత్నం.. తొక్కి చంపిన గజరాజు
Modi Laddu | ప్రధానిపై అభిమానం.. దీపావళికి ‘మోదీ లడ్డూ’.. ప్రత్యేకంగా తయారు చేస్తున్న వ్యాపారి