Allu Arjun | పుష్ప చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు “పుష్ప 2: ది రూల్” చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అయితే తనకు గద్దర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందించారు. తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో భాగంగా ఈ పురస్కారం తనకు దక్కడం పట్ల అల్లు అర్జున్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. పుష్ప2 చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డ్ అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు.. అయితే ఈ అవార్డ్ తనకి రావడం వెనక చిత్ర బృందం కృషి ఎంతో ఉందని తెలిపారు. క్రెడిట్ అంతా నా దర్శకుడు సుకుమార్ గారికి, నా నిర్మాతలకు, మొత్తం పుష్ప బృందానికి చెందుతుంది అని చెప్పుకొచ్చారు.
అలానే సినిమా విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరినీ కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ అవార్డును నా అభిమానులందరికీ అంకితం చేస్తున్నాను. మీ నిరంతర మద్దతు నన్ను ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది అని ఆయన రాసుకొచ్చారు .అయితే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడానికి అల్లు అర్జున్ వస్తారా రారా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పుష్ఫ 2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత నుండి రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్‌గా పరిస్థితి మారిపోవడం మనం చూశాం.
జూన్ 14న గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ అవార్డులలో బెస్ట్ యాక్టర్‌గా పుష్ప 2 చిత్రానికి గానూ అల్లు అర్జున్ ఎంపిక కాగా, ఈ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మరి ఈ వేడుకకు బెస్ట్ యాక్టర్‌గా నిలిచిన అల్లు అర్జున్ హాజరవుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా, పుష్ప సినిమాకు సంబంధించిన ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోవడంతో రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అరెస్ట్ చేయించారనే కొందరు ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా సైతం అల్లు అర్జున్ తీరును సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. అల్లు అర్జున్ బాధ్యతారహితంగా వ్యవహరించాడని ఆరోపించారు.మరి ఈ పరిణామాల మధ్య ఈ ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనిపించనున్నారా లేదా అనేది చూడాలి.