బాలీవుడ్లో ఎన్నో జనరంజక గీతాలతో సంగీత ప్రియులను అలరించిన ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ నాడీ వ్యవస్థకు సంబంధించిన అరుదైన వ్యాధికి గురైంది. సెన్సారీ న్యూరాల్ నర్వ్ డామేజీ కారణంగా ఆమె వినికిడి శక్తిని కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘కొద్ది రోజుల క్రితం ఫ్లైట్ దిగి బయటకు వస్తుండగా ఒక్కసారిగా వినికిడి శక్తిని కోల్పోయాను.
డాక్టర్లను సంప్రదించగా చెవిలోని నరాలకు సంబంధించి అరుదైన వ్యాధి అని చెప్పారు. వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల అలా జరుగుతుందని, చికిత్స ద్వారా కోలుకోవచ్చని చెప్పారు.ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీ దీవెనలు నాకు ఉండాలని కోరుకుంటూ మీ ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అని ఇన్స్టాగ్రామ్లో అల్కా యాగ్నిక్ తెలిపింది. 58 ఏళ్ల ఆల్కా యాగ్నిక్ విలక్షణ గాత్రంతో ఎన్నో గొప్ప గీతాలను ఆలపించారు. ముఖ్యంగా ప్రేమగీతాలతో పాపులారిటీ సంపాదించుకున్నారు.