‘ఆపరేషన్ సిందూర్’లో అసువులు బాసిన భారత సైనికుల మీద బాలీవుడ్ నటి అలియాభట్ తన భావోద్వేగాన్ని ఓ పోస్టు ద్వారా పంచుకుంది. ‘ దేశరక్షణకోసం నిజమైన హీరోలను కన్న తల్లుల ఆవేదన గుర్తొచ్చి నా హృదయం బరువెక్కింది. ఎందరో తల్లుల త్యాగమే ఈ దేశానికి రక్షణ. ప్రతి వీరసైనికుడి యూనిఫామ్ వెనుక.. నిద్రలేని రాత్రులు గడిపే అతని తల్లి ఉంటుంది.
పసివయసులో తన ఒడిలోనే ప్రశాంతంగా నిద్రించిన తన బిడ్డ.. ఇప్పుడు బార్డర్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను మనం ప్రతి రాత్రీ కోరుకుంటాం. కానీ అతనిది ఉద్రిక్తతతో నిండిన ప్రశాంతత. మన రక్షకుల కోసం.. మన దేశం కోసం కలిసి నిలబడదాం. పంటి బిగువున బాధను నొక్కిపెట్టిన ప్రతి తల్లికీ ప్రతిక్షణం అండగా ఉందాం.. జైహింద్.’ అంటూ సుదీర్ఘమైన పోస్టు పెట్టింది అలియాభట్.