Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా కంటి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం. దృష్టి లోపాలను సరిదిద్దుకునేందుకు ఆయన ‘విజన్ కరెక్షన్’ సర్జరీ చేయించుకున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే అక్షయ్ కుమార్, ఇటీవల తన షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసిన వెంటనే ఈ చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. మే 6న ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ మైనర్ సర్జరీ జరిగినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆపరేషన్ విజయవంతంగా పూర్తవడంతో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
వైద్యులు కొంతకాలం పాటు లైట్ల వెలుతురు, కెమెరా ఫ్లాష్‌లకు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ల సమయంలో అధిక వెలుతురు, సెట్స్‌లో ఉండే హై వోల్టేజ్ లైట్స్ కళ్లపై ఒత్తిడి పెంచే అవకాశం ఉండటంతో, పలువురు నటులు ఇలాంటి చికిత్సలు చేయించుకుంటుంటారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా గతంలో నాగార్జున, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కంటి చికిత్సలు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే తరహాలో అక్షయ్ కుమార్ కూడా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
అసలు విజన్ కరెక్షన్ సర్జరీ అంటే ఏమిటి అంటే.. చాలామందిలో కనిపించే దగ్గరి చూపు, దూరపు చూపు, బ్లర్ విజన్ వంటి సమస్యలను సరిచేయడానికి చేసే చికిత్సనే ‘విజన్ కరెక్షన్’ సర్జరీ అంటారు. ఇందులో కంటి ముందు భాగమైన కార్నియా ఆకారాన్ని మార్చడం ద్వారా కాంతి సరిగ్గా రెటీనాపై పడేలా చేస్తారు. దీంతో చూపు స్పష్టంగా మారుతుంది. ఈ సర్జరీల తర్వాత అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్‌లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా ఇది ‘అవుట్ పేషెంట్’ సర్జరీ కావడంతో, ఎక్కువసేపు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉండదు. ఇటీవల అక్షయ్ కుమార్ తన కొత్త చిత్రం కేరళం షూటింగ్‌ను కేరళలో పూర్తి చేశారు. ఈ సినిమాలో విద్యా బాలన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ ముగిసిన వెంటనే అక్షయ్ కుమార్ తన ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేతిలో పలు భారీ సినిమాలు ఉన్నాయి. వెల్కమ్ టు ది జంగిల్, గోల్మాల్ 5, హైవాన్ వంటి ప్రాజెక్టులతో పాటు మరాఠీ చిత్రం వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్ లో కూడా నటిస్తున్నారు.