Ajith | ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి లీకుల బెడద, పైరసీ పెనుభూతాలుగా మారాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో రకంగా మూవీ ఇంటర్నెట్లోకి వచ్చేస్తుంది. ఆన్లైన్లో సినిమాను లీక్ చేయకూడదని చిత్రబృందం కోర్టుకు వెళ్లినా, కొత్త సినిమాల లీకేజ్‌లు యదేచ్చగా సాగుతున్నాయి. తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలు కాస్త లేట్‌గా ఇంటర్నెట్లోకి వస్తున్నా, పెద్ద హీరోల సినిమాలు మాత్రం రిలీజైన కొద్ది గంటలలోనే ఇంటర్నెట్ లోకి వస్తుండడం అందరికి షాకింగ్‌గా మారింది. ఇలా లీక్ కావడం వలన కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే సంస్థలు వసూళ్ల పరంగా అనేక సమస్యలని ఎదుర్కొంటున్నారు. తాజాగా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విడుదలైన 8 గంటల్లోనే ఇంటర్నెట్లోకి వచ్చేసింది.
హెచ్ డీ ప్రింట్‌తో వివిధ వెబ్ సైట్స్‌లో అజిత్ మూవీ లీక్ కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇది విన్న అజిత్, చిత్ర బృందం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. తమిళ్ రాకర్స్ మాత్రమే కాకుండా, వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ పేజీల్లో కూడా సినిమాకు సంబంధించిన లింక్ షేర్ కావడంతో ఇది అందరికి చేరుతుంది. దీనిపై అజిత్ అభిమానులు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దు. థియేటర్స్‌లోనే వెళ్లి సినిమా చూడాలని కోరుతున్నారు. ఇక 280 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా, త్రిష కథానాయికగా నటించింది. ఇందులో ప్రసన్న, రెడిన్ కింగ్స్లీ, యోగి బాబు, ప్రభు, ప్రియా వారియర్, సిమ్రాన్, జాకీ ష్రాఫ్ వంటి వారు ముఖ్య పాత్రలలో కనిపించి సందడి చేశారు. అయితే ఈ చిత్రం హిట్ టాక్ అందుకోలేకపోయింది.
అజిత్ క్రేజ్ దృష్ట్యా .. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు కళ్లు చెదిరే బిజినెస్ జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం , రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి ప్రపంచవ్యాప్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీకి రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ పండితులు చెప్పుకొచ్చారు. రొమియోక్చర్స్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని, కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ని, శ్రీగోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్‌ని, ప్రత్యంగిరా సినిమాస్ యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ని భారీ రేటుకు దక్కించుకున్నాయి. అయితే అజిత్ సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.