Ajith | ఓవైపు సినిమాలు… మరోవైపు కార్ రేసింగ్ కోర్టులో వేగవంతమైన ప్రయాణం… తల అజిత్ జీవితం నిజంగా ఓ సాహసగాథలానే ఉంది. నటుడిగా ఎంతో పేరుతెచ్చుకున్న అజిత్, కార్ రేసర్‌గా కూడా అంతే జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో అజిత్ తన రేసింగ్ ప్రతిభను చాటుతూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాడు. అయితే ట్రాక్ పై అతడు చేసే విన్యాసాలు అభిమానులకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. 50 ఏళ్లు దాటినా అతడి డ్రైవింగ్ స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. కానీ అదే స్పీడ్ ఎన్నో సార్లు అతడిని ప్రమాదాలకు గురిచేసింది. వానిటీ వ్యాన్ల లైఫ్‌కి భిన్నంగా, రిస్క్‌తో కూడిన రేసింగ్ జీవితాన్ని ఎంచుకున్న అజిత్ పలుమార్లు ప్రమాదకరమైన ఘటనలకు లోనయ్యాడు.
రేసర్‌గా అనేక విజయాలు సాధిస్తున్నా, ప్రతి సారి రేస్‌కు వెళ్లినప్పుడు అభిమానుల గుండెల్లో టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం అజిత్ బెల్జియంలోని ప్రఖ్యాత స్పా-ఫ్రాంకోర్చాంప్స్ సర్క్యూట్లో జీటీ4 యూరోపియన్ సిరీస్ మూడవ రౌండ్‌కు సిద్ధమవుతున్నాడు. కానీ ఈనెల 25న జరిగే ‘క్రౌడ్‌స్ట్రైక్ 24 అవర్స్ ఆఫ్ స్పా 2025’ డ్రైవర్ పరేడ్‌కు హాజరయ్యే ముందు… ఇటలీలోని మిసానోలో మరో ప్రమాదంలో ఇరుక్కున్నాడు. రేస్ 2 సందర్భంగా ట్రాక్‌పై నిలిచిన కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అతడికి గాయాలు ఏమి కాలేదు కాని, రేస్‌కి దూరమవ్వాల్సి వచ్చింది.
అయితే, ప్రమాద స్థలంలో క్లీనింగ్ సిబ్బందికి సహాయం చేస్తూ అజిత్ కనిపించాడంటే, ఆయన వినయాన్ని అంతే అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా రేసింగ్ పట్ల ఉన్న అతడి ప్యాషన్ అంతా ఇంతా కాదు. 2003లో ఫార్ములా బిఎండబ్ల్యూ ఆసియా ఛాంపియన్‌షిప్‌తో రేసర్‌గా అరంగేట్రం చేసిన అజిత్, తరువాత 2010లో ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లోనూ తన ప్రతిభను చూపించాడు. జర్మనీ, మలేషియా వంటి దేశాల్లో పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ, సినిమాలు మరియు రేసింగ్ రెండింటికి సమాన ప్రాధాన్యత ఇస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. 2025లో అతడికి భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారం అయిన పద్మ భూషణ్ అవార్డు లభించటం గర్వకారణం. తెరపై హీరోగా, రియల్ లైఫ్‌లో రేసర్‌గా… తల అజిత్ దూకుడు కొనసాగిస్తున్నాడు.