‘దర్శకుడు ఈ కథ చెప్పి మూడు పాత్రలు పోషించాలని చెప్పినప్పుడు, ఇంత భారం మోయగలనా ఆని ఆలోచించాను. రెండు పాత్రలను వేరే వాళ్లతో చేయించొచ్చుగా అని అడిగాను. మూడూ నేనే ఎందుకు చేయాలో ఆయన వివరించి చెప్పారు. అప్పుడు కన్విన్స్ అయ్యాను. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని హీరో టోవినో థామస్ నమ్మకం వ్యక్తం చేశారు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘ARM’. ఐశ్వర్య రాజేశ్, కృతిశెట్టి, సురభి లక్ష్మీ కథానాయికలు. జితిన్‌లాల్ దర్శకుడు. లిస్టిన్ స్టీఫెన్ నిర్మాత. ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో టోవినో థామస్ మాట్లాడారు. ‘ఈ సినిమాకోసం దర్శకుడు ఎనిమిదేండ్లు కష్టపడ్డారు. గ్రేట్ యాక్టర్ టివినో థామస్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. ఐశ్వర్య అద్భుతమైన నటి. మంచి టీమ్‌తో కలిసి పనిచేశాను’ అని కృతిశెట్టి ఆనందం వ్యక్తంచేసింది. ఇందులో జోది అనే పాత్ర చేశానని, ఈ సినిమా పెద్ద విజయం సాధించబోతున్నదని ఐశ్వర్య రాజేష్ నమ్మకం వెలిబుచ్చారు.