అగ్ర నటి ఐశ్వర్యరాయ్‌కి కేన్స్ చిత్రోత్సవంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2002లో ఈ వేదికపై తొలిసారి మెరిసిన ఈ ప్రపంచసుందరి ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా హాజరవుతూ వీక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్యరాయ్ హాజరయ్యారు. ఈసారి సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో ఆమె కనిపించారు. బెనారసీ చీర, వజ్రాలు పొదిగిన వివిధ హారాలను ధరించి రాయల్‌లుక్‌లో కేన్స్ ఎర్రతివాచీపై హొయలొలికించింది. అన్నింటికంటే ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ నుదుటిన పెట్టుకున్న సిందూరం అందరి దృష్టిని ఆకర్షించింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకలా, పాకిస్థాన్ ప్రాయోజిత తీవ్రవాదంపై ఓ నిరసన ప్రకటనలా ఆమె సిందూరం ధరించారని అంటున్నారు. మరోవైపు గత కొన్ని నెలలుగా అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ వివాహబంధంపై పుకార్లు వస్తున్నాయి. ఈ దంపతులిద్దరూ విడిపోనున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ తమ బంధం తాలూకు విశ్వాసం, ప్రేమ, నిబద్దతను చాటిచెప్పేలా ఆమె సిందూరం ధరించిందని అనుకుంటున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బనారస్ చీరతో పాటు నుదుటిన సిందూరంతో ఈ ఏడాది ఐశ్వర్యరాయ్ కేన్స్‌లో భారతీయుల హృదయాల్ని కొల్లగొట్టింది. ఆమె లుక్‌పై సోషల్‌మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.