Aishwarya Rai | ఇటీవల రోడ్డు ప్రమాదాలకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వింటున్నాం. సెలబ్రిటీలు కూడా రోడ్డు ప్రమాదాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితం రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ సతీమణి సోనాలి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న వాహనం నాగపూర్‌లో ఓ ట్రక్కును ఢీకొట్టగా, అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడింది. ఇక తాజాగా బాలీవుడ్ అగ్ర నటి, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైందన్న వార్తతో అభిమానులు ఉలిక్కిపడ్డారు.
ఐశ్వర్య రాయ్ ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టగా, అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరెవరు ఉన్నారు, ఐశ్వర్యరాయ్ ఉందా అనే దానికి సంబంధించి వివరాలు బయటకి రాలేదు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జుహులోని ఐశ్వర్య నివాసం సమీపంలో జరిగింది. అయితే కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్సు కారుని ఢీకొట్టిన తర్వాత అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ప్రమాదం తర్వాత కారుని అక్కడే వదిలేసి వెళ్లినట్టు తెలుస్తుంది.
ప్రమాద సమయంలో ఐశ్వర్యరాయ్ కారులో కనిపించలేదు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.5050 నెంబర్ గల ఐష్ కారు ముంబై వాసులకు చాలా సుపరిచితం. హై ఎండ్ టయోటా వెల్ఫైర్ కారును కొన్నాళ్లుగా ఐశ్వర్యరాయ్ వాడుతుంది. దీని ధర రూ.1.30 కోట్లకి పైగానే ఉంటుందట. వెంటిలేటెడ్ స్పెషల్ సీట్లతో , లగ్జరీ ఇంటీరియర్లకు ఈ కారు ఫేమస్. ఐష్‌తో పాటు బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు కూడా ఈ కారును వినియోగిస్తున్నారు. ఈ కారుకి చాలా సేఫ్టీ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఐశ్వర్యరాయ్ ఈ మధ్య సినిమాలు తగ్గించింది. అడపాదడపా మాత్రమే చేస్తుంది.