Aishwarya Rai | పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులైన 26 మంది పర్యాటకులని కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే అక్కాచెల్లెమ్మల సిందూరం తుడిచేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సిందూరం పారించేందుకే ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. పాకిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ఈ మిషన్కి మంచి సపోర్ట్ లభించింది. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ ఆపరేషన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ తాజాగా తన సిందూర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించడం చర్చనీయాంశం అయింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత ఐష్ కేన్స్‌లో తన సిందూర్‌ని హైలైట్ చేయడంపై నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సిందూర్ ఆపరేషన్ ప్రత్యేకతను గుర్తు చేయడానికే ఐష్ ఇలా రెడీ అయ్యారని కొందరు విశ్లేషిస్తున్నారు. భారతీయత ఉట్టిపడేలా తెలుపు రంగు చీర, టిష్యూ డ్రేప్, మెడలో ముత్యాల హారాలు, మెరిసే సిందూరం..ఇలా సంప్రదాయబద్దంగా కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది ఐశ్వర్యరాయ్. 51 ఏళ్ల ఐశ్వర్యారాయ్ కోసం మనీష్ మల్హోత్రా చాలా శ్రమించి ఈ డిజైనర్ శారీని రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఐష్ ఈ బనారసీ చీరలో తన దేశీగాళ్ లుక్‌ని ప్రదర్శించి అందరి మన్ననలు అందుకుంటుంది.
గత కొద్ది నెలలుగా ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ విడాకులకి సంబంధించి కూడా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. వాటన్నింటికి కూడా చెక్ పెట్టడానికి ఐష్ తన సిందూరాన్ని హైలైట్ చేసిందని కొందరు అంటున్నారు. ఆమెకి తన భర్త పట్ల ఉన్న ప్రేమ, నిబద్ధతని తెలియజేసేందుకు అలా వచ్చిందని, అభిషేక్‌పై తన ప్రేమని ప్రపంచానికి మొత్తం తెలియజేసిందని కొందరి కామెంట్. ఈ లుక్ లో ఐశ్వర్య రాయ్ మహా రాణిలా కనిపిస్తోంది. నెటిజన్లు ఆమె అప్పీయరెన్స్, కేన్స్ ఫోటోలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 51 ఏళ్ల వయస్సులోను ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని అంటున్నారు. ఒక యూజర్ “చాలా కాలం తర్వాత నిన్ను చీరలో చూశాను, నువ్వు చాలా బాగున్నావు” అని రాసుకొచ్చారు. ఏది ఏమైన ఐష్ ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.