‘ఇందులో నా పాత్ర బోల్డ్‌గా బబ్లీగా ఉంటుంది. అలాగే హానెస్ట్ పర్సన్‌ని కూడా. నా ఒరిజినల్ క్యారెక్టర్‌కి దగ్గరగా ఉండే పాత్రను ఇందులో చేశాను. క్లారిటీ, విజన్ ఉన్న మంచి దర్శకుడు విజయ్. కథానుగుణంగా నా పాత్రను గొప్పగా డిజైన్ చేశారు.’ అని కథానాయిక అదితి శంకర్ అన్నారు. ప్రఖ్యాత దర్శకుడు శంకర్ కుమార్తె అయిన అదితి.. ‘భైరవం’ చిత్రం ద్వారా కథానాయికగా తెలుగుతెరకు పరిచయం అవుతున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి విజయ్ కనకమేడల దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ నెల 30న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అదితి శంకర్ సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘గొప్ప దర్శకుడిగా మా నాన్న ఇమేజ్‌ని గౌరవంగా భావిస్తా. అలాగే నటిగా నాకది ఛాలెంజ్ కూడా.
అందుకని ఒత్తిడిగా మాత్రం ఫీలవ్వను. నాన్నతో కలిసి షూటింగులకు హైదరాబాద్ వచ్చేదాన్ని. ఇప్పుడు సొంత సినిమాకోసం ఇక్కడకు వచ్చి షూటింగ్ చేయడం ఓ గొప్ప అనుభూతి. తెలుగులో పనిచేయాలని ఎప్పట్నుంచో ఉంది. ఇలాంటి మంచి సినిమా ద్వారా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఇందులోని ముగ్గురు హీరోల్లో మనోజ్ నాకు తెలుసు. సెట్లో నన్ను చూసి ‘ఇక్కడేం చేస్తున్నావ్?’ అనడిగారు. సినిమాలో నటిస్తున్నానని చెప్పాను. అది రియల్లీ ఫన్ మూమెంట్. అలాగే బెల్లంకొండ సాయిగారు డౌట్ టు ఎర్త్ పర్సన్. రోహిత్ నైస్ పర్సన్. ముగ్గురూ తమిళం బాగా మాట్లాడతారు. అందుకే నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు.’ అని చెప్పారు అదితి శంకర్. ‘మగధీర’ తెలుగులో తన ఫేవరెట్ మూవీ అని, రాజమౌళి, రామ్‌చరణ్‌లకు తను పెద్ద అభిమానిననీ, హిస్టారికల్, పిరియాడిక్ సినిమాలు, అలాగే ఛాలెంజింగ్ విమెన్ రోల్స్ చేయాలని ఉందని అదితి శంకర్ తెలిపారు.