Adah Sharma | హార్ట్ అటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఆదాశర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ తులసి సుందర్ కొచ్చ అనారోగ్యంతో బాధపడుతూ నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం (నవంబర్ 23) పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆదా శర్మ కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. ఈ ఏడాది ప్రారంభంలో అమ్మమ్మ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన ఆదా, సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి ఉన్న అందమైన వీడియోను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. అయితే కొద్ది నెలల్లోనే ఈ విషాదం సంభవించడంతో ఆమె ఫ్యామిలీ దుఃఖ సాగరంలో మునిగిపోయింది.
తులసి సుందర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సంతాపం తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘హార్ట్ అటాక్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆదా శర్మ తరువాత క్షణం, గరం, కల్కి, సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, సహాయ నటి పాత్రల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది. హిందీలో ‘ది కేరళ స్టోరీ’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’తో పాన్ ఇండియా స్థాయిలో మరింత ఫేమ్ సంపాదించింది.
ఈ సినిమాలతో పాటు వరుసగా వివాదాల్లో నిలుస్తూ వార్తల్లో నిలిచిన ఆదా శర్మ, ఇటీవల విక్రమ్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘తుమ్సే మేరి కసమ్’లో చివరిసారిగా కనిపించింది. అనుపమ్ ఖేర్, ఇష్వాక్ సింగ్, ఈషా డియోల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆదాకి సరికొత్త అనుభవాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు, వెబ్ సిరీస్లు ఉండగా, ఈ ఆకస్మాత్తు విషాదం ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేసింది.