“23’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ తరహా కథతో సినిమా తీయడం నిజంగా ఓ ఛాలెంజ్. ఈ సినిమా స్ఫూర్తితో ఇలాంటి కథలు మరిన్ని రావాలన్నదే నా ఆకాంక్ష’ అని అన్నారు దర్శకుడు రాజ్.ఆర్. ఆయన నిర్దేశకత్వంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రల్లో నటించిన ‘23’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు రాజ్ ఆర్ ఈ కథకు ప్రేక్షకుల అంగీకారం లభించడం ఆనందంగా ఉందన్నారు. నటీనటులందరూ అద్భుతంగా పర్ఫార్మ్ చేశారని, సినిమా తమ నమ్మకాన్ని నిలబెట్టిందని చెప్పారు.
తొలి సినిమాకే ఇలాంటి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని, సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయని కథానాయిక తన్మయి చెప్పింది. హీరో తేజ మాట్లాడుతూ ‘ఇలాంటి ఇంటెన్స్ స్టోరీతో నటుడిగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నా. పదేళ్ల తర్వాత చేయాల్సిన పాత్ర ఇది. నాపై నమ్మకంతో దర్శకుడు రాజ్ ఆర్ ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.