Sadha | దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించడానికి వీల్లేదంటూ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఈ తీర్పును చాలామంది సమర్థిస్తుండగా.. జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే చాలామంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఇదిలా ఉంటే సెలబ్రెటీలు కూడా సోషల్‌మీడియా వేదికగా తమ విచారం చెబుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నటి సదా కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వీధి కుక్కల గురించి ఆలోచిస్తేనే తన మనసు ముక్కలవుతోందని వెక్కి వెక్కి ఏడ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
‘ దేశ రాజధాని ఢిల్లీలో సుమారు మూడు లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నాయి. వాటన్నింటికీ 8 వారాల్లో ప్రభుత్వం షెల్టర్స్ ఎక్కడ సిద్ధం చేయగలరు? ఇది జరగని పని. వాటన్నింటినీ షెల్టర్లలో ఉంచడం సాధ్యపడదు కాబట్టి చివరకు చంపేసే పరిస్థితి వస్తుంది. మాస్ కిల్లింగ్స్ జరగుతాయని భయం వేస్తోంది. ‘ అని సదా ఆవేదన వ్యక్తం చేసింది.
‘ రేబిస్ నియంత్రణ కోసం వీధికుక్కలకు వ్యాక్సిన్లు వేయకుండా మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వం ఏం చేసింది? యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్‌కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదని సదా అన్నారు. ఇప్పటికే యానిమల్ లవర్స్, ఎన్జీవోలు తమవంతు సహాయం చేస్తున్నా, ప్రభుత్వ మద్దతు చాలా తక్కువ ఉందని తెలిపారు. ఇళ్లలో కుక్కలు, పిల్లులు పెంచుకునే ప్రతి ఒక్కరూ ఈ తీర్పు వ్యతిరేకంగా ముందుకు రావాలని.. లేనిపక్షంలో జంతు ప్రేమికులమనే హక్కు మనకు లేదన్నారు. ఇండియా లాంటి దేశంలో ఇలాంటి తీర్పు వస్తుందని ఊహించలేదని తెలిపారు.
‘ వీధి శునకాల గురించి ఆలోచిస్తేనే మనసు ముక్కలవుతోంది. నాకేం చేయాలో తెలియడం లేదు. ఎవరిని కలవాలి? ఎక్కడ నిరసన చేయాలి? ఏదీ తోచట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. వాటిని చంపడం కరెక్ట్ కాదు. ఇటువంటి తీర్పు వచ్చినందుకు మనమంతా సిగ్గుపడాలి. దయచేసి ఈ తీర్పు వెనక్కి తీసుకోవాలి’ అని వెక్కి వెక్కి ఏడ్చింది.